- వీలైతే ఇళ్లలోనే నమాజు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వండి
- మసీదుల్లో నలుగురికి మాత్రమే అనుమతి:
- ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ , జుమ్మా నమాజ్ లలో నలుగురు మాత్రమే మసీదుల్లో ప్రార్థనలు చేయాలి
- హోం మంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్: లాక్ డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రంజాన్ ప్రార్థనలు చేయాలని రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమూద్ అలీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) ప్రార్థనలు చేయాలని ఆయన సూచించారు. రంజాన్ సందర్భగా ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో నలుగురు మాత్రమే ప్రార్థనలు చేయాలని హోం మంత్రి తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ , జుమ్మా నమాజ్ లలో నలుగురు మాత్రమే మసీదుల్లో ప్రార్థనలు చేయాలని పేర్కొన్నారు. మసీదు చిన్నదైనా, పెద్దదైనా నలుగురి కన్నా ఎక్కువ మంది ఉండరాదని స్పష్టం చేశారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులను , లాక్ డౌన్ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదరులు ప్రభుత్వ సూచనలను పాటించాలన్నారు.మసీదులు అందుబాటులో లేనప్పుడు స్వంత ఇళ్లలో ప్రార్థనలను చేసుకోవాలన్నారు. ఈ సారి కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోందని, దీనివల్ల అజాగ్రత్త వహిస్తే ఇబ్బందులు పడతారని, దీనిని నివారించడానికి సామాజిక దూరం మరియు శానిటైజర్ లేదా సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో మసీదులలో గుమిగూడడం మానేయాలని, ఇళ్లలో ప్రార్థనలకు ప్రాముఖ్యత ఇవ్వాలని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మసీదులలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదుల వెలుపల ప్రార్థనలు చేయడానికి అనుమతి లేదని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను నిర్వహించరాదని అన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి, నియమాలను ఖచ్చితంగా పాటించడానికి మనమందరం కలిసి పనిచేయాలని మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు.
