రేపే పాక్ తో భారత్ ఢీ.. వర్షం ఏం చేస్తుందో!

రేపే పాక్ తో భారత్ ఢీ.. వర్షం ఏం చేస్తుందో!

కోహ్లీ గ్యాంగ్ కు అసలు సిసలైనా సత్తా చూపాల్సిన టైం వచ్చేసింది. ఎన్ని దేశాలపై రికార్డులు నమోదు చేసినా…. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై విక్టరీ అంటే…భారత క్రికెట్ అభిమానులకు మర్చిపోలేని గిఫ్ట్. దీంతో రేపటి భారత్,పాక్ మ్యాచ్ ను ఎంజాయ్ చేసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

భారత్, పాక్ టీముల్లో టీమిండియానే బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్,  బౌలింగ్,  ఫీల్డింగ్… అన్ని విభాగాల్లోనూ మంచి ఫాంతో ఉంది కోహ్లీ గ్యాంగ్. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ధోనీ, హార్ధిక్ పాండ్యా మంచి ఫాంలో ఉన్నారు. టీమిండియాకు రోహిత్, కోహ్లీ, ధోనీ లాంటి సీనియర్లు ఉండటం కలిసొచ్చే అంశం. అటూ బౌలర్లు కూడా బలంగానే ఉన్నారు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తున్నారు. స్పిన్నర్లు చాహల్, కుల్ దీప్ బంతితో ఓ ఆట ఆడుకుంటున్నారు. టీమిండియాలో హార్ధిక్ పాండ్యా ఆల్ రౌండర్ గా ఆకట్టుకుంటున్నాడు. అయితే రేపటి మ్యాచ్  గెలుపు ధీమా వ్యక్తం చేశారు కోహ్లీ.

పాకిస్థాన్ లో కొత్తవాళ్లు ఎక్కువగా ఉన్నా… తక్కువ అంచనా వేయలేం. భారత్ కు బ్యాటింగ్ బలమైతే…పాకిస్థాన్ కు బౌలింగ్ ఆయుధం. పాకిస్తాన్ టాప్ ఆర్డర్ లో ఇమాముల్ హక్,  అబిద్ అలీ, ఫకర్ జమాన్, బాబర్ ఆజం బలంగా కనిపిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్, సోహైల్ కూడా ధాటిగా ఆడుతున్నారు. వీరిలో ఏ ఇద్దరు క్లిక్ అయినా…భారీ స్కోర్ కొట్టే ఛాన్స్ ఉంది. బౌలింగ్ లోనూ పాక్ బలంగా ఉంది. మహ్మద్ అమీర్, వాహబ్ రియాజ్  ఆకట్టుకుంటున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు తీశాడు అమీర్. వరల్డ్ కప్ లో ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్ కూడా అమీరే.

వరుస విక్టరీలతో జోష్ లో ఉన్న టీమిండియా… ఇప్పటి వరకు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాను ఓడించింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ … వర్షం కారణంగా రద్దయింది. దీంతో వరల్డ్ కప్ లో ప్రస్తుతం 5 పాయింట్లతో భారత్ నాల్గో ప్లేస్ లో ఉంది. అటు పాకిస్తాన్ నాలుగు మ్యాచ్ లు ఆడి రెండింట్లో ఓడింది. పాయింట్ల టేబుల్ లో ఎనిమిదో స్థానంలో ఉంది.

ఆదివారం జరిగే భారత్ –  పాక్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో రెండు దేశాల అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అటు భారత్, పాక్ మ్యాచ్ ను క్యాష్ చేసుకునేందుకు హోటల్స్, రెస్టారెంట్స్ పబ్బులు రెడీ అవుతున్నాయి. పెద్ద పెద్ద లైవ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాయి.