పళ్ళను గట్టిగా రుద్దకూడదు

పళ్ళను గట్టిగా రుద్దకూడదు

కరోనా వైరస్​ లాలాజలం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని కొందరు సైంటిస్టులు గుర్తించారు. అలాగే, కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నవాళ్లలో చిగుళ్లు వాయడం  (పెరియోడాంటిటిస్) ​సమస్యను గమనించారు ఢిల్లీకి చెందిన డెంటిస్ట్​ రీచా వత్స. ఈ టైంలో చిగుళ్లు, దంత సమస్యలు రాకుండా రీచా చెబుతున్న జాగ్రత్తలివి. 
నీళ్లు సరిపోను తాగకపోతే డీహైడ్రేషన్​కు లోనవుతారు. నోరు పొడిగా మారుతుంది. అప్పడు నోటితో శ్వాస తీసుకోవడం మొదలు పెడతారు. దాంతో నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అందుకే దాహం వేసేంత వరకు ఆగకుండా మధ్య మధ్యలో నీళ్లు తాగుతుండాలి. ఫ్లోరిన్​ ఉన్న టూత్​పేస్ట్​నే వాడాలి. హెల్దీ టీత్​ కోసం రోజూ 3 నిమిషాలు కేటాయించాలి. రెండు నిమిషాలు  బ్రష్​ చేయాలి, దంతాల మధ్య ఇరుక్కున్న వాటిని ఎయిర్​ ఫ్లాసర్​ లేదా ప్రొక్సా బ్రష్​ సాయంతో తీసేందుకు ఒక్క నిమిషం ఇవ్వాలి. నాలుకను శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే రోజూ ఉదయాన్నే సగం టీస్పూన్​ ఉప్పు కలిపిన కప్పు వేడినీళ్లు నోట్లో పోసుకొని10–12 సెకన్లు పుక్కిలించాలి. 

బ్రష్​ చేసేటప్పుడు దంతాలను గట్టిగా రుద్దకూడదు. అలాగే టంగ్​ క్లీనర్​తో నాలుక మీద ఎక్కువ సేపు రాయొద్దు. అలా చేస్తే నాలుక మీద ఉన్న మంచి​ బ్యాక్టీరియా పోతుంది. ఆకుకూరలు, బ్రైట్​ కలర్స్​లో ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు నోటి ఆరోగ్యం, శుభ్రతకు అవసరమైన పోషకాలు, లవణాలు ఉంటాయి. ఇవి దంతాలను కూడా హెల్దీగా ఉంచుతాయి.  ఏ చిన్న దంత సమస్య వచ్చినా డెంటిస్ట్​ను కలవాలి. ఆర్నెల్లకు ఒకసారి డెంటల్​ చెకప్​ చేయించుకోవాలి. దాంతో నోటి, దంత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. షుగర్​, సాల్ట్​ ఎక్కువగా ఉన్న స్నాక్స్​ తినడం, డ్రింక్స్​ తాగడం వల్ల దంతాలు రంగు మారతాయి. అందుకే చిప్స్​, స్వీట్స్, చాక్లెట్లు కాకుండా క్యారెట్ స్టిక్స్​  వంటి హెల్దీ స్నాక్స్​ తినాలి. అలాగే తరచూ యాసిడ్ ఉన్న ఫుడ్​ తినడం, ఆల్కహాల్​ తాగడం వల్ల కూడా దంతాలు సెన్సిటివ్​ అవుతాయి.