సరైన రోడ్డు లేక మధ్యలోనే ఆగిపోయిన అంబులెన్స్​

 సరైన రోడ్డు లేక మధ్యలోనే ఆగిపోయిన అంబులెన్స్​
  • ఓ బాలింత నరకయాతన 
  • సరైన రోడ్డు లేక మధ్యలోనే ఆగిపోయిన అంబులెన్స్​
  • విధి లేని పరిస్థితుల్లో ఊరి నుంచి నడిచొచ్చిన మహిళ  
  • నిర్మల్​ జిల్లా కుభీర్​లో ఘటన

కుభీర్, వెలుగు : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఐదు రోజుల బాలింత తన పాపను ఎత్తుకుని మూడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. మండలంలోని పాంగర్ పాడ్ గ్రామానికి చెందిన కదం లావణ్య ఇటీవల బైంసా ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ లో నాలుగో సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించారు. బుధవారం కుట్లు విప్పడానికి బైంసా ఏరియా దవాఖానాకు వెళ్లాల్సి వచ్చింది.

లావణ్యను తీసుకువెళ్లడానికి గ్రామానికి 102 అంబులెన్స్ బయలుదేరింది. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో నిగ్వా సమీపంలో ముందుకు వెళ్లే పరిస్థితి లేక ఒకచోట ఆగిపోయింది. దీంతో లావణ్య, ఆమె కుటుంబసభ్యులు చేసేదేమీ లేక పసిపాపను ఎత్తుకుని 3 కిలోమీటర్లు నడిచి అంబులెన్స్​దగ్గరకు చేరుకోవాల్సి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి దవాఖానాకు తీసుకువెళ్లారు. రాష్ట్రం ఏర్పడి సుమారు తొమ్మిదేండ్లు కావస్తున్నా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.