పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే ఏలాంటి ఫుడ్ తినాలి?

పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే ఏలాంటి ఫుడ్ తినాలి?

తల్లి కడుపులో పిండం ఎదుగుతూ శరీర భాగాలు తయారవుతున్నప్పుడే మంచి పోషకాలు అందించాలి. లేదంటే పిల్లలు ఆరోగ్యంగా ఎదగరు. మానసిక లోపాలతో పుడతారు. అందుకే తల్లి పోషకాహారాన్ని తప్పక తినాలి.  అప్పుడే పిల్లల మెదడుకు మంచి పోషణ అందుతుంది. పెద్దయ్యాక చురుకుగా తయారవుతారు.

  •   గర్భం దాల్చిన 4–6 వారాల్లోనే  పిండంలో న్యూరల్‌‌‌‌ ట్యూబ్‌‌‌‌ ఏర్పడుతుంది. ఇది మెదడువెన్నెముక ఆరోగ్యంగా ఎదగడానికి సాయ పడుతుంది. కాబట్టి మొదటి వారం నుండే ఫోలిక్‌‌‌‌ యాసిడ్‌‌‌‌ ఉన్న ఫుడ్‌‌‌‌ తినాలి. ఉసిరి ఆకులు, అవిశ ఆకులు, తృణ ధాన్యాలు, చిక్కుళ్లు, బచ్చలి కూర, బ్రొకొలీ తినాలి. ఆకుకూరలు, గుడ్డు పచ్చసొన, చికెన్‌‌‌‌, మాంసం తింటే ఐరన్‌‌‌‌ అందుతుంది. వీటితో పాటు సిట్రస్‌‌‌‌ పండ్లలో కూడా ఐరన్‌‌‌‌ ఉంటుంది.  
  •   మెదడులో హిప్పోకాంపస్‌‌‌‌ అనేది ఉంటుంది. ఇది జ్ఞాపకాలను దాచి ఉంచే పెట్టె. ఙ్ఞాపక శక్తి కోసం జింక్ సాయపడుతుంది. హిప్పోకాంపస్‌‌‌‌లో కొత్త న్యూరాన్ల తయారీకి ఉపయోగపడుతుంది. అంతేకాదు జింక్‌‌‌‌ వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లల్లో జింక్ లోపిస్తే కాగ్నిటివ్‌‌‌‌ డిసీజ్ లాంటి మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ప్రాబ్లమ్స్ వస్తాయి. జింక్ ఎక్కువ ఉన్న తృణ ధాన్యాలు, చిక్కుళ్లు, డార్క్‌‌‌‌ చాక్లెట్‌‌‌‌, గుడ్లు, చికెన్‌‌‌‌, పాల ఉత్పత్తుల్ని తినాలి. 
  •  మెదడు సరిగ్గా పనిచేయడానికి, న్యూరో ట్రాన్స్‌‌‌‌మీటర్‌‌‌‌‌‌‌‌ల ఉత్పత్తికి ప్రొటీన్‌‌‌‌ సాయపడుతుంది. పిండానికి సరైన పోషణ అందకపోతే స్కిజోఫ్రీనియా, అల్జీమర్స్‌‌‌‌ లాంటి మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే పప్పుదినుసులు, గుడ్లు, కూరగాయలు, మాంసం, చికెన్‌‌‌‌, పాల ఉత్పత్తులు బాగా తినాలి. 
  •  ఒమెగా 3, ఒమెగా 6ను న్యూరోప్రొటెక్టర్స్‌‌‌‌ అంటారు. ఇవి లోపిస్తే ఆటిజమ్‌‌‌‌, డిస్లేక్సియా, డిస్‌‌‌‌ప్రాక్సియా లాంటి లోపాలతో పుడతారు. ఇవి రాకుండా ఉండాలంటే చేపలు, వాల్‌‌‌‌నట్స్‌‌‌‌, సోయాబీన్స్‌‌‌‌, జనపనార, అవిశె గింజలు తినాలి.  
  •  విటమిన్స్‌‌‌‌ మెదడు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతాయి. ముఖ్యంగా థయమిన్ (విటమిన్‌‌‌‌ –బి1) లోపం వల్ల నాడీ వ్యవస్థ పైన ప్రభావం ఉంటుంది. అందుకే కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, పండ్లు తినాలి. 
  • ఎముకల బలానికి, శరీరంలో హిమోగ్లోబిన్‌‌‌‌ పెరగటానికి రాగి ఉపయోగపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్లని కూడా పెంచుతుంది. అల్జీమర్స్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రాగి ఎక్కువగా దొరికే లివర్‌‌‌‌‌‌‌‌, పుట్టగొడుగులు, కొకోవా తినాలి.  
  • థైరాయిడ్‌‌‌‌ హార్మోన్స్‌‌‌‌లో అయోడిన్ ఉంటుంది. ఇది తక్కువ కావడంతో  థైరాయిడ్‌‌‌‌ వల్ల వచ్చే సమస్యలు పిల్లలకూ వస్తాయి. అందుకే అయోడిన్ ఉన్న ఆహారం పాల పదార్థాలు, గుడ్లు, చేపలు తినాలి.