
- కడుపులో కవలలతో గర్భిణి నరకయాతన
- వాగు దాటి 108 ఎక్కే లోపే ప్రసవం
- మార్గమధ్యంలోనే మృతిచెందిన శిశువు
- మంచిర్యాలలో మరో శిశువుకు జన్మ
- ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన తల్లి వేదన
ఆసిఫాబాద్, వెలుగు: కడుపులో కవలలు ఉన్న ఓ గర్భిణి పురిటి నొప్పులతో 2 కిలోమీటర్ల దూరం నచిడి నరకయాతన అనుభవించింది. ఆపై కుటుంబ సభ్యలు సాయంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును అతికష్టం మీద దాటింది. అప్పటికే నొప్పులు ఎక్కువై ఓ శిశువుకు జన్మనివ్వగా ఆ బిడ్డను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే చనిపోయాడు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బండగూడకు చెందిన ఆత్రం ధర్మబాయి 7 నెలల గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108కు కాల్ చేశారు. ఊరికి వెళ్లే దారిలో వాగు ప్రవహిస్తుండడంతో సిబ్బంది అంబులెన్స్‌ను వాగు అవతల నిలిపేశారు. దీంతో గర్భిణి 2కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి అతికష్టం మీద వాగు దాటింది. వాగు ఒడ్డునే ఆమె ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది.
అనంతరం కూడా ఆమెకు నొప్పులు కొనసాగుతుండడంతో ఆసిఫాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి శిశువు అప్పటికే మరణించిందని చెప్పారు. ఆమె కడుపులో ఇంకో శిశువు ఉందని, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలని సూచించారు. ధర్మబాయిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మరో మగ శిశువుకు జన్మనిచ్చింది.