ప్రీ మెట్రిక్ హాస్టళ్లు మూత!

ప్రీ మెట్రిక్ హాస్టళ్లు మూత!
  • ప్రీ మెట్రిక్ హాస్టళ్లు మూత!
  • స్టూడెంట్లు తక్కువున్నరని 150 దాకా మూసేయాలని సర్కారు నిర్ణయం
  • వాటిని పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లుగా మార్చే ప్లాన్‌

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో పలు బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లను సర్కారు ఎత్తేయనుంది. 20 మంది లోపు పిల్లలున్న హాస్టళ్లను మూసివేయనుంది. ఈ హాస్టళ్లను తిరిగి పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లుగా మార్చాలని ఇటీవలే నిర్ణయం తీసుకుంది. అయితే, కొత్తగా పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు ఏర్పాటు చేయకముందే ప్రీమెట్రిక్‌ హాస్టళ్లను బంద్‌ చేసుడేందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రెండేండ్లుగా కరోనా భయంతో హాస్టళ్లలో ఉండేందుకు స్టూడెంట్లు ఇంట్రెస్ట్‌ చూపించట్లేదు. దీంతో హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఇదే సాకుగా సర్కారు హాస్టళ్లను మూయాలని చూస్తోంది. రాష్ట్రంలో 669 ఎస్సీ, 419 బీసీ ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు, 326 ఆశ్రమ స్కూళ్లున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కలిపి మొత్తం 150 మూతబడనున్నాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. 

అవసరం ఉన్న చోటుకు తరలించకుండా..
రాష్ట్రంలో పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్ల పెంపు అవసరం ఉన్నప్పటికీ వాటిని ఏర్పాటు చేయకుండా ఉన్న ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లను మూసివేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే 20 దాకా బీసీ హాస్టళ్లను ప్రీమెట్రిక్‌ నుంచి పోస్ట్‌ మెట్రిక్‌గా మార్చారు. ఇప్పటివరకు విద్యార్థులు తక్కువగా ఉంటే ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న చోటుకు తరలించారు. ఇప్పుడు మాత్రం ఉన్న ప్లేస్​లోనే పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలోని స్కూల్‌లో 2 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ, ఇక్కడ ఒకే ఎస్సీ హాస్టల్‌ ఉంది. ఇక్కడ బీసీ, ఎస్టీ హాస్టల్‌ అవసరం ఉన్నప్పటికీ ఏర్పాటు చేయలేదు. ఒక వేళ ఇతర ప్రాంతాల్లో ఉన్న హాస్టల్‌ నడవకుంటే.. స్టూడెంట్లు ఎక్కువున్న చోట్లకు తరలించవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ప్రీ మెట్రిక్‌ నుంచి పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లుగా మార్చడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంతో మెల్లమెల్లగా హాస్టళ్లు లేకుండా చేయడమేనని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కొత్తగా పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి.