
- ఆరోగ్య తెలంగాణలో భాగస్వామ్యం కావాలని పిలుపు
- అంగన్‌వాడీలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వెల్లడి
- ప్రభుత్వ రంగ సంస్థలు, ఎన్జీవోలు, అధికారులతో మంత్రి సమావేశం
హైదరాబాద్, వెలుగు: పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. సమిష్టి కృషితోనే న్యూట్రీషన్ తెలంగాణ సాధ్యపడుతుందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు దేశానికే ఆదర్శంగా తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్‌కు అనుగుణంగా అంగన్‌వాడీ సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు. సోమవారం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సేవల బలోపేతం, చిన్నారుల్లో పోషకాహారాన్ని మెరుగుపరచడం, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం వంటి అంశాలపై బేగంపేట టూరిజం ప్లాజాలో రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పోషకాహారంపై పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (ఎన్ఐఎన్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, సీఎఫ్‌టీఆర్‌ఐ (మైసూర్), ఎయిమ్స్, ఇక్రిశాట్, యూనిసెఫ్ వంటి సంస్థలు, ఆంధ్ర మహిళా సభ, బాల రక్ష భారతి వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పోషకాహారం అందించడంలో లైన్ డిపార్ట్‌మెంట్‌లుగా వ్యవహరిస్తున్న పలు సంక్షేమ శాఖలు, సివిల్ సప్లైస్, విద్యా శాఖ, టీజీ ఫుడ్స్, సెర్ప్, ఐ అండ్ పీఆర్ శాఖల అధికారులు పాల్గొని తమ సలహాలు, సూచనలు అందచేశారు. త్వరలో స్టేట్ న్యూట్రీషన్ ప్లాన్ రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు.
అంగన్‌వాడీ లబ్ధిదారులకు రోజుకు 200 మిల్లీలీటర్ల విజయ పాలు, కిశోర బాలికలకు పోషకాలతో కూడిన తృణధాన్యాలు, పల్లీపట్టీలు, వారానికి రెండుసార్లు ఎగ్ బిర్యానీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. నిపుణుల అభిప్రాయాలు, అనుభవాల ఆధారంగా పోషకాహార తెలంగాణ కోసం కార్యాచరణను రూపొందించి, అమలు చేస్తామని తెలిపారు.
తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను మంత్రి వివరించారు. “చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కౌమార బాలికలకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
నిపుణుల సలహాలతో పౌష్టికాహారం అందించే అంశం పరిశీలిస్తున్నాం. పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చర్యలు స్టార్ట్ చేశాం. ఇందుకోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక నిర్మాణ సౌకర్యం లేని ప్రాంతాల్లో మొబైల్ అంగన్‌వాడీలను ప్రవేశపెడుతున్నాం. నాక్, జేఎన్‌టీయూ వంటి సంస్థలు మోడల్స్ సిద్ధం చేశాయి.
హైదరాబాద్‌లో వలస కూలీల పిల్లలకు పౌష్టికాహారం అందించేలా మొబైల్ అంగన్‌వాడీలు ఏర్పాటు చేయనున్నాం. అంగన్‌వాడీ కేంద్రాలను దత్తత తీసుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆసక్తిని తెలిపిన నేపథ్యంలో అవసరమైన ప్రోత్సాహక చర్యలు తీసుకుంటాం” అని మంత్రి సీతక్క వెల్లడించారు.
పోషన్ వాటికలో భాగంగా సీడ్స్ కిట్
నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఆరు రకాల కూరగాయల విత్తనాలతో కూడిన సీడ్స్ కిట్‌ను మంత్రి సీతక్క రిలీజ్ చేశారు. మొదటి విడతలో 4,500 అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ విత్తనాల కిట్‌లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో పాలకూర, తోటకూర, మెంతికూర, టమాట, వంకాయ, బెండకాయ విత్తనాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో వీటిని పెంచి వండి పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ సృజన, టీజీ ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గత మూడు నెలల్లో చేపట్టిన కార్యకలాపాలు, జిల్లాల్లో కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశాలపై మంత్రి సీతక్కకు చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు రిపోర్ట్ అందజేశారు.