తెలంగాణలో మరో 79 డయాలసిస్ సెంటర్లు

తెలంగాణలో  మరో 79 డయాలసిస్ సెంటర్లు
  • ఎమర్జెన్సీ కేసుల కోసం 50 ఆస్పత్రుల్లో స్పెషల్ యూనిట్స్ 
  • సర్కార్‌‌‌‌‌‌‌‌కు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు 
  • రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 102 సెంటర్లు

హైదరాబాద్, వెలుగు:  కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా మరో 79 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనలను వైద్యారోగ్య శాఖ అధికారులు గత నెలలోనే ప్రభుత్వానికి పంపించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 55 సెంటర్లు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని మెడికల్ కాలేజీల్లో నాలుగు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించేలా 20 పీహెచ్‌‌‌‌సీలను సీహెచ్‌‌‌‌సీలుగా అప్‌‌‌‌గ్రేడ్ చేసి, అక్కడ కూడా డయాలసిస్ యూనిట్లను నెలకొల్పాలని కోరారు. అత్యవసర కేసుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. జీజీహెచ్‌‌‌‌‌‌‌‌లు, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల ఎమర్జెన్సీ వార్డుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు మిషిన్ల చొప్పున మొత్తం 100 కొత్త మిషిన్లను అందుబాటులోకి తేనున్నారు. గడ్డి మందులు, ఇతర ప్రాణాంతక మందులు తాగినప్పుడు డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమయంలో రెగ్యులర్ డయాలసిస్ సెంటర్లలో బెడ్లన్నీ షెడ్యూల్ ప్రకారం నిండిపోతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ పేషెంట్లను ఇతర హాస్పిటళ్లకు రిఫర్ చేయకుండా అక్కడికక్కడే ట్రీట్మెంట్ ఇచ్చేలా ఈ స్పెషల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 

20 నిమిషాల్లోనే వైద్యం అందేలా ప్లాన్.. 

రాష్ట్రంలో కిడ్నీ రోగులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రస్తుతమున్న డయాలసిస్ సెంటర్లు సరిపోవడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 102 డయాలసిస్ సెంటర్లు ఉండగా, వీటి ద్వారా సుమారు 12,600 మంది పేషెంట్లు ఉచితంగా సేవలు పొందుతున్నారు. అయితే పేషెంట్ల రద్దీ దృష్ట్యా కొత్త సెంటర్ల అవసరం పెరిగింది. ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లే భారం లేకుండా పేషెంట్ ఇంటి నుంచి బయలుదేరితే.. కనీసం 20 నిమిషాల్లోనే డయాలసిస్ సెంటర్ అందుబాటులో ఉండేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ కొత్త సెంటర్ల ఏర్పాటు పనులు ప్రారంభం కానున్నాయి.