
పకోడీ, మంచూరియా, టిక్కీ... ఇవి వేర్వేరు పదార్థాలతో రకరకాల వెరైటీల్లో తిని ఉంటారు. మరి సోయాచంక్స్(మీల్‌మేకర్స్)తో ఈ వెరైటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఇప్పుడే చేసేయండి. స్ట్రీట్ ఫుడ్‌ని ఇంట్లోనే వేడివేడిగా తినాలనుకుంటే ఈ హెల్దీ శ్నాక్ అస్సలు మిస్ కాకండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేసే ఈజీ శ్నాక్ ఐటెమ్స్ సోయాతో.. సో సింపుల్! సో.. యమ్మీ!
మంచూరియా
కావాల్సినవి :
మీల్ మేకర్స్ – ముప్పావు కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, సోయాసాస్, చిల్లీసాస్, టొమాటో సాస్ – ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున, కారం – అర టీస్పూన్, మిరియాల పొడి – పావు టీస్పూన్, కార్న్ ఫ్లోర్, ఉల్లికాడలు, క్యాప్సికమ్ తరుగు – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు, నూనె, ఉప్పు – సరిపడా
తయారీ :
మీల్ మేకర్స్‌ని వేడి నీళ్లలో పావుగంట సేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఒకసారి కడిగి, నీళ్లన్నీ వడకట్టాలి. ఆపై వాటిని ఒక గిన్నెలో వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో మీల్ మేకర్స్ వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో కొంచెం నూనె వేడి చేసి అందులో ఉల్లికాడలు, క్యాప్సికమ్ వేసి వేగించాలి. తర్వాత సోయాసాస్, చిల్లీసాస్, టొమాటోసాస్ వేసి కలపాలి. చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్ వేసి అందులో నీళ్లు పోసి కలపాలి. ఆ నీళ్లను కూడా మిశ్రమంలో వేసి కలపాలి. కాసేపయ్యాక కారం, ఉప్పు కూడా వేసి కలపాలి. చివరిగా మీల్ మేకర్స్ కూడా వేసి కలిపితే సరి. గార్నిష్ కోసం కొత్తిమీర, ఉల్లికాడలు వంటివి చల్లుకోవచ్చు.
పకోడీ
కావాల్సినవి :
మీల్ మేకర్స్ – ఒక కప్పు
పసుపు – పావు టీస్పూన్
ఉప్పు, ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మరసం – సరిపడా
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – రెండు టీస్పూన్లు
కారం, ధనియాల పొడి, గరం మసాలా – ఒక్కో టీస్పూన్ చొప్పున
శనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్, బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూన్
తయారీ :
ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో మీల్ మేకర్స్ వేసి పది నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిలోని నీళ్లను చేత్తోనే పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలపాలి. పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత అందులో ధనియాలపొడి వేసి కలపాలి. పాన్‌లో నూనె వేడి చేసి రెడీ చేసిపెట్టుకున్న మీల్ మేకర్స్ వేసి వేగించాలి. ఆ తర్వాత పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా అదే నూనెలో వేగించి తీసుకోవాలి. ఒక గిన్నెలో మీల్ మేకర్ పకోడి, వేగించిన కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలపాలి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నప్పుడు ఉల్లిగడ్డ తరుగు, నిమ్మరసం చల్లుకుని తింటే... టేస్ట్ అదిరిపోతుంది.
టిక్కీ
కావాల్సినవి :
మీల్ మేకర్స్ – ఒకటిన్నర కప్పు, శనగపిండి – ఒక కప్పు
పచ్చిమిర్చి – మూడు, అల్లం – చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, క్యారెట్ ముక్కలు – అర కప్పు, జీలకర్ర – ఒక టీస్పూన్, మిరియాలు, పసుపు – పావు టీస్పూన్, కొత్తిమీర – కొంచెం,
ఇంగువ – చిటికెడు, గరం మసాలా – అర టీస్పూన్, ఉల్లిగడ్డ తరుగు – పావు కప్పు, మొక్కజొన్న గింజలు – కొన్ని
తయారీ :
మీల్ మేకర్స్‌ని వేడి నీళ్లలో కాసేపు ఉడికించి, వడకట్టి పక్కన పెట్టాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్ ముక్కలు, జీలకర్ర, మిరియాలు, కొత్తిమీర అన్నీ మిక్సీజార్‌లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఉడికించిన మీల్ మేకర్స్ వేసి మరోసారి మిక్సీపట్టాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పసుపు, ఉప్పు, గరం మసాలా, ఇంగువ, ఉల్లిగడ్డ తరుగు, మొక్కజొన్న గింజలు, శనగపిండి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేతితో ఉండలు చేసి, టిక్కీలా వత్తాలి. పాన్‌లో నూనె వేడి చేసి టిక్కీలను వేసి రెండు వైపులా వేగించాలి. వీటిని టొమాటో కెచెప్ లేదా రైతాతో తింటే టేస్ట్ బాగుంటాయి.