వామ్మో..టైటానియం డయాక్సైడ్​, జాంతియం గమ్​ తో..అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ

వామ్మో..టైటానియం డయాక్సైడ్​, జాంతియం గమ్​ తో..అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ
  •    1300 కిలోల పేస్ట్​ పట్టివేత..ఒకరి అరెస్ట్

సికింద్రాబాద్​, వెలుగు :  కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్​ను తయారు చేస్తున్న యూనిట్ పై ఈస్ట్​జోన్​టాస్క్​ఫోర్స్​పోలీసులు దాడి చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. టాస్క్​ఫోర్స్​పోలీసులు తెలిపిన మేరకు.. తార్నాక లాలాపేట జనప్రియ అపార్టుమెంట్​లో ఉండే నీలా వెంకటేశ్వర్లు(54), కొంతకాలంగా వివిధ రకాల బ్రాండ్ల కంపెనీల అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను సిటీలోని మార్కెట్లలో రిటైల్​డీలర్లకు సరఫరా చేసేవాడు. అతనికి వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. దీంతో ఈజీగా మనీ సంపాదించేందుకు కల్తీ అల్లం, -వెల్లుల్లి పేస్ట్​ తయారు చేసి మార్కెట్​లో రిటైల్​అమ్మకందారులకు సరఫరా చేసేందుకు ప్లాన్ చేశాడు.

ఇందుకు టైటానియం డయాక్సైడ్​మిశ్రమం, జాంతియం గమ్​ను కొనుగోలు చేశాడు. వీటితో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి చిరు వ్యాపారులకు సరఫరా చేస్తుండడమే కాకుండా స్వయంగా అల్లం తయారు చేసేందుకు వినియోగించే మెటీరియల్​ను సైతం అమ్ముతున్నాడు. సమాచారం మేరకు ఈస్ట్​ జోన్​పోలీసులు బల్దియా సికింద్రాబాద్​సర్కిల్ సిబ్బందితో వెళ్లి వెంకటేశ్వర్లును రెడ్​హాండెడ్​గా పట్టుకున్నారు.

సుమారు రూ.1.70లక్షల విలువైన 1,300 కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, తయారీలో వాడే 20కిలోల టైటానియం డయాక్సైడ్. జాంతియం గమ్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి జీహెచ్ఎంసీ అధికారులకు అప్పగించారు. గతంలో కూడా వెంకటేశ్వర్లు కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.