హామీలు, అబద్ధాలు

హామీలు, అబద్ధాలు

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనే ధీమాతో మెజార్టీ ప్రజల ఆమోదం ఉన్నా లేకున్నా వేలాదికోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వాలు పప్పుబెల్లాల్లా పంచేవిధానాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రజలు పన్నుల రూపంలో కట్టే ప్రతి రూపాయికీ జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వాలు పథకాల పేరుతో నగదు బదిలీలు చేస్తూ ఒకరకంగా అధికారికంగా ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఐతే ఇలాంటి దివాలాకోరు విధానాల్ని నియంత్రించే సరైన వ్యవస్థ లేకపోవడమే శోచనీయం. 

అలవికాని హామీలు

అధికారంలోకి రావడానికి పథకాల పేరుతో వేలాదికోట్ల రూపాయాల్ని పంచిపెట్టడం ఏంటో, వాటిని గొప్ప స్కీముల రూపంలో ప్రచారం చేసుకోవడమేంటో, ప్రజలు కూడా వాటికి ఆశపడి ఓట్లేయడమేంటో ఈ ప్రజాస్వామ్యానికే తెలియాలి!  జనాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగజేసి, సుస్థిరమైన అభివృద్ధికి బాటలువేసే పథకాల గురించి పక్కనబెట్టి  గత కొన్నేండ్లుగా కేవలం తాత్కాలిక ప్రయోజనాలనిచ్చే తాయిలాలను పథకాలుగా చెప్పి ప్రజా ఓట్లను దండుకొంటున్న ప్రభుత్వాలు పుట్టుకొస్తున్నాయి. విపక్షాలు కూడా ఒకర్ని మించి మరొకరు ఈ పుక్కిడి పథకాలతో ఓటర్లకు ఎరవేస్తుంటే అసలు భవిష్యత్తులో ప్రభుత్వాల వద్ద పంచడానికి కాదుగదా ప్రభుత్వాలను నడపడానికి కూడా నిధులుంటాయా అనే సంశయం కలుగుతుంది. 

వీళ్ల వాగ్దానాలు, మేనిఫెస్టోలు చూస్తే. ప్రజలు కూడా ఈ తాత్కాలిక ప్రయోజనాలకే మొగ్గుచూపుతూ సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నంతగా దిగజారిపోతున్నారు. గ్యాస్ సిలెండర్ 1200 ఉన్నప్పుడు ఒక్కరూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల ముంగిట ఎకాఎకిన రూ.400 కే ఇస్తామనడం.. అది ఎట్లా సాధ్యమో ప్రజలు ఆలోచించాలి. అర్హులైన కౌలు రైతుల్ని పక్కనబెట్టి, రైతులకు ఏమేరకు ఉపయోగపడుతున్నయో తెలియని రైతుబంధు మొత్తాన్ని మరింత పెంచుతాననడం, రైతులకు గతంలో ఉన్న అనేక రాయితీలను, ప్రయోజనాలను తుంగలో తొక్కడం రైతులు అర్థం చేసుకుంటున్నారో లేదో తెలియదు. వేలకోట్లు అప్పు తెస్తే తప్ప ఇప్పుడిస్తున్న రైతుబంధు ఇవ్వలేని పరిస్థితి ఉంటే.. ఆ బంధును రూ. 15000 కు పెంచి, కౌలురైతులకూ, వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామని మరో పార్టీ ప్రకటిస్తే అసలది ఎట్లా సాధ్యమో ఆలోచించుకోవాల్సింది ప్రజలే. ఇక నెలనెలా   పింఛన్లను వేలకు వేలు పెంచితే అర్హులకంటే అనర్హులే ఎక్కువగా లబ్ధి పొంది, ప్రజలు పనిచేసుకొని బతికే నైజాన్ని మరిచిపోతున్నారనే విషయం ప్రభుత్వపెద్దలకు తెలియంది కాదు. 

ఓవైపు ఉచితం, మరో వైపు పన్నుమోత

ప్రజలు కట్టే పన్నులతో ఇవన్నీ సాధ్యం కాదని జీతాలు కూడా సరిగా ఇవ్వలేని ప్రస్తుత ప్రభుత్వమే నిరూపించింది. అంగన్ వాడీలు, ఆశాలు, ఔట్ సోర్సింగు ఉద్యోగులకు జీతాలు, ఫీజు రీయింబర్స్​మెంట్లు, కాంట్రాక్టర్లకు వేలకోట్ల బకాయిలూ.. ఇంకా ఎన్నో ఎన్నో ఇప్పటికీ పెండింగులో ఉన్నాయి. లక్షలకోట్లు అప్పుచేసినా,  ప్రభుత్వ భూములమ్మి వేలకోట్లు సొమ్ముచేసుకున్నా, ధనవంతుడికి కూడా అందుబాటులో లేనంతగా మద్యం రేట్లు పెంచి, రాష్ట్రంలోని తొంబై శాతం ప్రజల్ని మద్యం మత్తులో ముంచినా, కరెంటు, పెట్రో, ఆర్టీసీ,  రిజిస్ట్రేషన్​ చార్జీలు ఇట్లా.. లెక్కలేనంతగా టాక్స్​ల పేరుతో దోచినా సాధ్యం కానివి.. 

ప్రస్తుత మేనిఫెస్టోల్లో ఇంతకు పదిరెట్లు పెంచి చూపిన స్కీంలు రేపెట్లా సాధ్యమవుతాయో ప్రజలు గ్రహించాలి. కోట్లు ఖర్చుపెట్టి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామనడం ఏంటి? రాష్ట్రంలో ఉన్న ఆయా వర్గాలవారు ఆ ఆత్మగౌరవ భవనాల్లో నెలకోసారి నిద్రచేసి వస్తారా? ప్రజలకు అన్నీ అవసరమే! అయితే వాటి ప్రాధాన్యతాక్రమాన్ని పాటించక పోవడమే పాలకుల వైఫల్యం. విద్య, ఉద్యోగాలు, వైద్యం, మెరుగైన రవాణా వంటి ప్రాధాన్యతా అంశాలు ప్రస్తుతం అప్రధాన అంశాలై కూర్చుంటే.. రాష్ట్రం సాధించామని జబ్బలు చరుచుకోవడం వల్ల ఒరిగేదేముంది?

– కటుకోజ్వల మనోహరాచారి,టీచర్​