దేశం కోసం పెద్ద కలలు కనండి

దేశం కోసం పెద్ద కలలు కనండి

న్యూఢిల్లీ: కొత్త, అభివృద్ధి చెందిన భారత దేశంకోసం చిన్నారులు పెద్ద కలలు కనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈనాటి కలలను రేపు సాకారం చేసుకోవచ్చని సూచించారు. సోమవారం బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్​ కల్చరల్​ సెంటర్​లో తనను కలిసిన వివిధ పాఠశాలల విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. భారతదేశ సంస్కృతితో మమేకం కావాలని, తల్లిదండ్రులను గౌరవించాలని, మాతృభూమిని ప్రేమించాలని సూచించారు. బాల్యం ఒక అందమైన దశ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. కొత్తతరం కొత్త కలలు, కొత్త అవకాశాలను తీసుకువస్తుందన్నారు.

‘ఇది సాంకేతిక, సమాచార విప్లవ కొత్త యుగం. పిల్లలు గృహ, సామాజిక, పర్యావరణ సమస్యలపై చక్కని అవగాహన కలిగి ఉన్నారు. సాంకేతికత రాకతో జ్ఞానం, సమాచారం వారి చేతివేళ్లలో దాగి ఉంది.’ అని పేర్కొన్నారు. వారికి సరైన విలువలు బోధించడానికి మరింత కృషి చేయాలని, చర్చలు, వివిధ కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలన్నారు. పెద్దయ్యాక ఎలాంటి భారతదేశంలో జీవించాలనుకుంటున్నారో ఆలోచించాలని, ఫలితం గురించి ఆలోచించకుండా శ్రమించాలని సూచించారు.