బిపిన్ రావత్ లోటు పూడ్చలేనిది 

బిపిన్ రావత్ లోటు పూడ్చలేనిది 

కూనూర్: తమిళనాడులోని కూనూర్ లో చోటు చేసుకున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మృతి చెందారు. ఈ రోజు ఉదయం తమిళనాడులోని వెల్లింగ్టన్ కు వెళ్తుండగా రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. దాంతో హెలికాప్టర్ లోని 13 మంది మృత్యువాత పడ్డారు. ఆయన మృతిని నిర్ధారిస్తూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. రావత్ మృతిపై ప్రముఖ నేతలు సంతాపం తెలిపారు. దేశం గొప్ప బిడ్డలను కోల్పోయిందని ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ అన్నారు. రావత్ మృతి తనను షాక్ కు గురి చేసిందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన అందించిన సేవలు అపూర్వమని ప్రధాని మోడీ అన్నారు.

‘జనరల్ బిపిన్ రావత్ అద్భుతమైన సైనికుడు. ఆయన నిజమైన దేశభక్తుడు. త్రివిధ దళాలను ఆధునీకరించడంలో రావత్ విశేషంగా కృషి చేశారు. వ్యూహాత్మక విషయాల్లో ఆయన ఆలోచనలు అసాధారణమైనవి. ఆయన మృతి నన్ను కలచివేసింది’ అని మోడీ ట్వీట్ చేశారు. 

‘ఇది దేశానికి దుర్దినం. విషాద ప్రమాదంలో సీడీఎస్, జనరల్ బిపిన్ రావత్ ను మనం కోల్పోయాం. అత్యంత సాహసవంతులైన సైనికుల్లో రావత్ ఒకరు. జన్మభూమిపై ప్రేమ, అనురక్తితో ఆయన విధులు నిర్వర్తించారు. ఆయన సేవల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు దేవుడు మనోబలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. 

‘బిపిన్ రావత్ లోటు పూడ్చలేనిది. అసమాన ధైర్యసాహసాలతో ఆయన తన బాధ్యతలను నిర్వర్తించారు. త్రివిధ దళాలను కలపి ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన పక్కా ప్రణాళికలు రచించారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. ఈ ఘటనలో గాయాలపాలైన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.