మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్లో మహిళల సంఖ్య పెరగాలి
ఎంఈఎస్ ట్రైనీ ఆఫీసర్లతో భేటీలో రాష్ట్రపతి ముర్ము పిలుపు
ఢిల్లీ : మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (ఎంఈఎస్) లో మహిళల సంఖ్య ఇంకా పెరగాలని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్, ఎంఈఎస్ ఆర్కిటెక్ట్, సర్వేయర్ క్యాడర్ కు చెందిన చెందిన ట్రైనీ ఆఫీసర్లు గురువారం రాష్ట్రపతి భవన్ లో ముర్మును కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యంగ్ ఆఫీసర్లుగా పర్యావరణంపై శ్రద్ధ వహించాలని సూచించారు. మెరుగైన సేవలు అందించేందుకు ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. ‘‘దేశం కోసం మన జవాన్లు తమ ప్రాణాలు అర్పించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి సైనికులకు సేవలు అందిస్తున్నందుకు మీరు (ఎంఈఎస్ ట్రైనీ ఆఫీసర్లు) గౌరవంగా భావించాలి.
ఇటీవలి కాలంలో మన సాయుధ బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. ముఖ్యంగా డిఫెన్స్ ఫోర్సెస్ లోని కాంబాట్ రోల్స్, మెడికల్ సర్వీసెస్ లో ఆడవారి సంఖ్య పెరగడం మంచి పరిణామం. మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్ లో కూడా త్వరలో వారి ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆశిస్తున్నా” అని ముర్ము అన్నారు. ఇండియా గత నెలలో జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించినపుడే ఎంఈఎస్ ట్రైనీ ఇంజనీర్స్ విధుల్లో చేరారని రాష్ట్రపతి తెలిపారు. సాయుధ బలగాలైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ తదితర సంస్థలకు ఇంజనీరింగ్ సపోర్ట్ అందించడంలో ఎంఈఎస్ ఇంజనీర్లు కీలకపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సౌర ఫలకల ప్రాజెక్టు పూర్తిచేసి కర్బన ఉద్గారాలను తగ్గించడంలోనూ ఎంఈఎస్ కృషి చేస్తోందని కొనియాడారు.

