శ్రీశైలం అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి స‌హా ప‌లువురి సంతాపం

శ్రీశైలం అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి స‌హా ప‌లువురి సంతాపం

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన ఘటనపై ప్రముఖులు త‌మ‌ సంతాపాన్ని ప్రకటించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు వారంతా ట్వీట్లు చేసి తమ సంతాపాన్ని ప్రకటించారు.

. ‘శ్రీశైలం హైడ్రాలిక్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగి మనుషుల ప్రాణాలు పోవడం తీవ్రంగా బాధించింది. ఈ కష్టకాలంలో బాధితుల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.’ అంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

తెలంగాణ‌లోని శ్రీశైలం హైడ్రాలిక్ ప్లాంట్‌లో ప్రమాదం తనను కలచివేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తన సంతాపం తెలియజేశారు.

శ్రీశైలం హైడ్రో ఎల‌క్ట్రిక్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించారు.

శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో పలువురు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు.

‘శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయాల పాలైన వారికి అత్యున్నత వైద్యం అందించాలని కోరుతున్నాను.’ అని చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.