ఉల్లి ధర పెరుగుతది

ఉల్లి ధర పెరుగుతది

రాష్ట్రానికి ఉల్లిగడ్డ దిగుమతి తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల అక్కడి నుంచి ఉల్లి వస్తలేదు. ఫలితంగా మనకు కొరత ఏర్పడుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే హోల్‌సేల్‌ ధరలు పెరగ్గా, త్వరలో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు తిప్పలు తప్పేలా లేవు. మరో నెల దాకా ఉల్లిగడ్డ దిగుమతి ఇలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అక్కడ భారీ వర్షాలతో..

రాష్ట్రానికి వివిధ రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డ దిగుమతి అవుతుంది. మహారాష్ట్రలోని పుణె, నాసిక్‌, ఏపీలోని కర్నూలు జిల్లా, కర్నాటక నుంచి ఎక్కువగా వస్తుంది. గత 20 రోజులుగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో పంటలన్నీ ధ్వంసమయ్యాయి. రోడ్డు రవాణా స్తంభించింది. రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రాష్ట్రానికి ఉల్లిగడ్డ రావడంలేదు.

దిగుమతి భారీగా తగ్గుదల

హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌కు ఉల్లి దిగుమతి అవుతుంది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఈనెల 2వ తేదీన మొదటి రకం ఉల్లిగడ్డ 3,726 క్వింటాళ్లు, రెండో రకం 5,589 క్వింటాళ్లు వస్తే, ఈ నెల 20 దాకా మొదటి రకం 2,372 క్వింటాళ్లు, రెండో రకం 3,557 క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వచ్చింది. గతేడాది ఆగస్టు 2న మొదటి రకం 4,261 క్వింటాళ్లు, రెండో రకం 6,391 క్వింటాళ్ల ఉల్లి గడ్డ వచ్చింది. గతేడాది ఆగస్టు 20న మొదటిరకం 6,223 క్వింటాళ్లు, రెండో రకం 9,334 క్వింటాళ్ల చొప్పున ఉల్లి వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మొత్తంగా 9 వేల క్వింటాళ్లకు పైనే దిగుమతి తగ్గింది.

క్వింటాల్‌ రూ.2,700

ఉల్లి లోడ్‌ తక్కువగా రావడంతో హోల్‌సేల్‌ వ్యాపారులు రేట్లు పెంచేస్తున్నారు. ఈనెల 2న మొదటి రకం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,800, రెండో రకం రూ.900 ఉంది (నాణ్యతను బట్టి ధర మారుతూ ఉంటుంది). కానీ బుధవారం మాత్రం మొదటి రకం క్వింటాల్‌కు రూ.2,700, రెండో రకం రూ.1,700 ధర పలుకుతోంది. అంటే సుమారు రూ.900 హోల్‌సేల్‌ ధర ఎక్కువ పలుకుతోంది. గతేడాది ఇదే సమయానికి మొదటి రకం క్వింటాల్‌కు 1,400, రెండో రకం రూ.800 ఉంది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ సారి హోల్‌సేల్‌ ధరలు డబుల్‌ అయ్యాయి. నెలరోజుల పాటు ఉల్లిగడ్డ దిగుమతి తగ్గుతుందని, దీంతో రేట్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్​లో కిలో ఉల్లిగడ్డ రూ.25 నుంచి 30 వరకు ఉండగా, మరో రూ.ఐదు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.