అయోధ్య రామమందిరం ఈవెంట్‌లో పాల్గొనే పూజారి, 16 మంది పోలీసులకు కరోనా

అయోధ్య రామమందిరం ఈవెంట్‌లో పాల్గొనే పూజారి, 16 మంది పోలీసులకు కరోనా

అయోధ్య: ఆగస్టు 5న రామజన్మభూమి వద్ద జరిగే శంకుస్థాపన జరిగే ప్రదేశంలో డ్యూటీలో ఉన్న పూజారి, 16 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయోధ్య రామమందిరం ప్రధాన పూజారికి అసిస్టెంట్‌ ప్రదీప్‌దాస్‌కు పాజిటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. అంతే కాకుండా సెక్యూరిటీగా ఉన్న 16 మందికి పాజిటివ్‌ వచ్చిందని టెంపుల్‌ ట్రస్ట్‌ చెప్పింది. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని అన్ని సెఫ్టీ రూల్స్‌ పాటిస్తూ నిర్వహిస్తామని ట్రస్ట్‌ సభ్యులు ప్రకటించారు. కేవలం 200 మంది మాత్రమే కార్యక్రమానికి హాజరవుతారని గతంలోనే ప్రకటించారు. శంకుస్థాపన కార్యక్రమంలో వారణాసి, అయోధ్యకు చెందిన 11 మంది పూజార్ల బృందం పాల్గొంటుందని, ఆ 11 మందిలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి లేడని ట్రస్టు సభ్యులు చెప్పారు. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామమందిరం శంకుస్థాపన జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చి.. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లో మొత్తం 29,997 కేసులు ఉండగా.. అయోధ్యలో 375 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.