మేడారంలో మండ మెలిగే పండుగ

మేడారంలో మండ మెలిగే పండుగ
  • సమ్మక్క, సారలమ్మ ఆలయంతో పాటు గద్దెలను శుద్ధి చేయనున్న పూజారులు

తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో ముఖ్య ఘట్టమైన మండ మెలిగే పండుగ బుధవారం జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం సమ్మక్క దేవత పూజారులు మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయం, సారలమ్మ పూజారులు కన్నేపల్లిలోని సారలమ్మ గుడిని పవిత్ర గంగాజలాలతో శుద్ధి చేయనున్నారు. సమ్మక్క దేవత ప్రధాన పూజారి అయిన సిద్దబోయిన మునీందర్‌‌‌‌ ఇంట్లో ప్రత్యేక పూజల అనంతరం ఆడబిడ్డలు మంగళహారతులు, డోలు వాయిద్యాల, సన్నాయి మేళాల నడుమ అమ్మవార్ల గుడికి చేరుకుంటారు.

అడవిలో సేకరించిన పుట్టమన్నుతో గుడిలో అలుకుపూతలు చేసి ముగ్గులు వేస్తారు. దేవుని గుట్ట తీసుకొచ్చిన కంక వనాన్ని గద్దెల వద్ద నిలిపి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మేడారం గ్రామం పొలిమేరల్లో బూరక చెట్టు కొమ్మలను నాటి వాటికి కోడిపిల్ల, అనపకాయ కట్టి పానకం ఆరబోసి పసుపు, కుంకుమ పెట్టి దిష్టి పీడలు రాకుండా కట్టుపోస్తారు. అక్కడి నుంచి గ్రామ దేవతలైన బొడ్రాయి, మహాలక్ష్మి, భూలక్ష్మీ, పోతురాజులకు ప్రత్యేక మొక్కులు సమర్పిస్తారు.