ఇజ్రాయెల్​కు అండగా భారత్​

ఇజ్రాయెల్​కు అండగా భారత్​
  • నెతన్యాహూ ఫోన్ చేశారు: మోదీ
  • ఇండియా.. మాకూ దోస్తే: పాలస్తీనా

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని ప్రధాని మోదీ ప్రకటించారు. టెర్రరిస్టుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు మోదీ మంగళవారం ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నాకు ఫోన్ చేశారు. అక్కడున్న ప్రస్తుత పరిస్థితులను వివరించారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. 

ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్ కు ఇండియా అండగా ఉంటుంది. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఇండియా తీవ్రంగా ఖండిస్తుంది” అని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా, ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ కూడా ప్రకటించాయి. హమాస్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని జాయింట్ స్టేట్ మెంట్ లో పేర్కొన్నాయి. 

ఇండియా జోక్యం చేసుకోవాలి: పాలస్తీనా 

ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటికీ ఇండియా ఫ్రెండ్ అని మన దేశంలోని పాలస్తీనా అంబాసిడర్ అబూ అల్హయిజ అన్నారు. ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ తో పాటు అంతర్జాతీయ సమాజమే కారణమని ఆరోపించారు. ‘‘మా దేశ ప్రధాని పలు యూరోపియన్ దేశాలతో టచ్ లో ఉన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటికీ ఇండియా ఫ్రెండ్. ఇండియా ఇందులో జోక్యం చేసుకుని, రెండు దేశాల మధ్య చర్చలు జరిగేలా చూడాలి” అని కోరారు.