- పార్టీ పోస్టర్లలో లాలూ ఫొటో కూడా పెట్టట్లే
 - కాంగ్రెస్, ఆర్జేడీ అత్యంత అవినీతి పార్టీలు
 - కేంద్రంలో అధికారంలోకి వస్తామని రాహుల్ కలలు కంటున్నారని కామెంట్
 
కటిహార్/సహర్సా: ఆర్జేడీ చీఫ్, తన తండ్రి లాలూప్రసాద్ యాదవ్ చేసిన పాపాలను దాచేందుకు ఇండియా కూటమి సీఎం క్యాండిడేట్, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఆర్జేడీ పోస్టర్లలో లాలూ ఫొటోలను కూడా పెట్టడం లేదు. ఒకవేళ పెట్టినా ఓ మూలన చిన్నగా పెడుతున్నారు. ఎందుకంటే ఆటవిక పాలన (జంగిల్ రాజ్) చేసిన ఘనత లాలూకు ఉంది. ఆయన చేసిన పాపాలను దాచేందుకు ఇప్పుడు అతని కొడుకు (జంగిల్ రాజ్ కా యువరాజ్) తేజస్వీ యాదవ్ ప్రయత్నిస్తున్నారు” అని విమర్శించారు. సోమవారం బిహార్‌లోని కటిహార్, సహర్సా జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండియా కూటమిపై విమర్శలు చేశారు.
బిహార్‌లోనే అత్యంత అవినీతి ఫ్యామిలీ ఆర్జేడీ పార్టీని నడిపిస్తుంటే, దేశంలోనే అత్యంత అవినీతికి పాల్పడిన ఒక ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తల మీద ఆర్జేడీ తుపాకీ పెట్టడంతోనే, ఇండియా కూటమి సీఎం క్యాండిడేట్‌గా తేజస్వీని కాంగ్రెస్ అంగీకరించిందని పేర్కొన్నారు. ‘‘జాయింట్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను చూసి కాంగ్రెస్ నేతలే షాక్ అవుతున్నారు. వాటికి ఆర్జేడీనే వివరణ ఇవ్వాలని దూరందూరంగా ఉంటున్నారు.
బిహారీలను అవమానించిన తెలంగాణ, తమిళనాడు సీఎంలను కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. తద్వారా తమ కూటమిపై వ్యతిరేకత ఏర్పడి, ఎన్నికల్లో ఓడిపోతుందని ఆశ పడుతున్నారు” అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.
అయోధ్యకు వెళ్లేందుకు టైమ్ లేదా?
కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బిహార్ ప్రాజెక్టులను అడ్డుకున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘‘2005లో బిహార్‌లో ఆర్జేడీ అధికారం కోల్పోయింది. అదే టైమ్‌లో కేంద్రంలో కాంగ్రెస్‌తో అధికారాన్ని పంచుకున్నది. ఈ క్రమంలో ఆనాడు బిహార్‌లో కొత్తగా ఏర్పడిన నితీశ్ సర్కార్‌ను ఇబ్బందులకు గురిచేసింది. మన్మోహన్, సోనియాపై ఒత్తిడి తెచ్చి కోసి మహాసేతు లాంటి ప్రాజెక్టులను అడ్డుకున్నది” అని ఆరోపించారు.
ఎన్డీయే అంటే వికాసమని, ఇండియా కూటమి అంటే వినాశనమని కామెంట్ చేశారు. వాళ్లు చేసిన పాపాలకు శిక్షించాల్సిన టైమ్ వచ్చిందని అన్నారు. ‘‘చొరబాటుదారులకు కాంగ్రెస్, ఆర్జేడీ రక్షణగా నిలుస్తున్నాయి. దేశ భద్రత విషయంలో కాంప్రమైజ్ అయ్యాయి. ట్రిపుల్ తలాక్ రద్దు చట్టాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీలు.. ఇప్పుడు వక్ఫ్ చట్టం రద్దు గురించి మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ నేతలకు విదేశాలకు వెళ్లేందుకు టైమ్ ఉంటుంది కానీ, అయోధ్య రామ మందిరానికి వెళ్లే టైమ్ మాత్రం ఉండదని ప్రధాని విమర్శించారు.
విదేశీ నేతలకు మఖానా బాక్స్‌లు ఇచ్చిన..
విమెన్ వరల్డ్ కప్‌లో విజయం సాధించిన ఇండియన్ టీమ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వాళ్లంతా దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు. ‘‘నేను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి నేతలకు మఖానా బాక్స్‌లను గిఫ్ట్‌గా ఇచ్చాను. ఇవి బిహార్ రైతుల కష్టానికి నిదర్శనమని వాళ్లకు చెప్పాను” అని ప్రధాని పేర్కొన్నారు.
ఆర్ అండ్ డీకి రూ.లక్ష కోట్ల ఫండ్..
భారత్‌ను సైన్స్ అండ్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో భాగంగా అత్యంత క్లిష్టమైన, అధిక ప్రభావం చూపే ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినట్టు పేర్కొన్నారు.
సోమవారం ఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ (ఈఎస్‌టీఐసీ)ను ప్రధాని మోదీ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా రూ.లక్ష కోట్లతో రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రారంభించారు. ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
