ఇది అబద్ధాల మార్కెట్లో తెరిచిన దోపిడీ దుకాణం

ఇది అబద్ధాల మార్కెట్లో తెరిచిన దోపిడీ దుకాణం

రెడ్ డైరీ’లో కాంగ్రెస్ బాగోతం
ఇది బయటకొస్తే కాంగ్రెస్ కు ఓటమి తప్పదు 
దోచుకోవడానికే ప్రతిపక్షాల కూటమి అని కామెంట్ 
పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు జాతికి అంకితం
పీఎం కిసాన్ నిధులు విడుదల

సికర్ (రాజస్థాన్): రాజస్థాన్ లో ప్రభుత్వం పేరిట కాంగ్రెస్ పార్టీ అబద్ధాల మార్కెట్లో దోపిడీ దుకాణాన్ని తెరిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ‘రెడ్ డైరీ’యే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తుందన్నారు. గురువారం రాజస్థాన్ లోని సికర్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం చేశారు. పీఎం కిసాన్ 14వ విడత నిధులను విడుదల చేశారు. దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ.17వేల కోట్లు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ ‘దోపిడీ దుకాణం’ నుంచి వచ్చిన మరో కొత్త ఉత్పత్తి ‘రెడ్ డైరీ’. అందులో కాంగ్రెస్ అవినీతి, అక్రమాలన్నీ ఉన్నాయి. అవన్నీ బయటకొస్తే కాంగ్రెస్ బాగోతం బయటపడుతుంది. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుంది” అని చెప్పారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ దోచుకుంటున్నదని మండిపడ్డారు. పేపర్ల లీకేజీతో ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడుతున్నదని ఆరోపించారు. కాగా, అశోక్ గెహ్లాట్ సర్కార్ చేసిన అవినీతి, అక్రమాలన్నీ ‘రెడ్ డైరీ’లో ఉన్నాయంటూ ఇటీవల మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురైన రాజేంద్ర గుఢా పేర్కొన్నారు.  

దోచుకునేందుకే జట్టుకట్టిన్రు.. 
ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు. ఆ కూటమి.. దేశ ప్రయోజనాల కోసం పెట్టింది కాదని, దేశాన్ని దోచుకోవడానికేనని ఆరోపించారు. యూపీఏ హయాంలో జరిగిన దారుణాలు, అవినీతి, అక్రమాలు ప్రజలకు గుర్తుకురాకుండా ఉండేందుకే కూటమి పేరు మార్చుకున్నారని విమర్శించారు. ‘‘గతంలో మోసాలకు పాల్పడిన కంపెనీలు.. పేరు మార్చుకుని కొత్త బిజినెస్ మొదలుపెట్టినట్టుగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాల తీరు ఉంది. టెర్రరిజం ముందు తలవంచుకున్నామనే మరకను తొలగించుకునేందుకు వాళ్లు పేరు మార్చుకున్నారు. దేశ శత్రువుల మాదిరిగానే వాళ్ల తీరు ఉంది. వాళ్ల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకున్నది దేశభక్తిని చాటుకోవడానికి కాదు.. దేశాన్ని దోచుకోవడానికే” అని ఆయన కామెంట్స్ చేశారు. దేశంలో దశాదిశ లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. 

గెహ్లాట్ స్పీచ్ రద్దుపై వివాదం.. 
ప్రధాని సభలో తన స్పీచ్ ను రద్దు చేశారంటూ గెహ్లాట్ ఆరోపించారు. ‘‘వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రోగ్రామ్ లో నేను మాట్లాడాల్సి ఉండగా, నా స్పీచ్ రద్దు చేశారు. అందుకే ప్రధానికి ట్విట్టర్ ద్వారా స్వాగతం పలుకుతున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు. గెహ్లాట్ ఆరోపణలను పీఎం ఆఫీస్ ఖండించింది.  ప్రధాని మోదీ కూడా కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘కాలి గాయం కారణంగా గెహ్లాట్ ఈ సభకు హాజరు కాలేకపోయారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని చెప్పారు. 

గుజరాత్ కు మోదీ.. 
రాజస్థాన్ పర్యటన తర్వాత ప్రధాని రెండ్రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ కు బయలుదేరి వెళ్లారు. రాజ్ కోట్ సిటీకి దగ్గర్లో నిర్మించిన ఎయిర్ పోర్టును గురువారం ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు. 1,500 ఎకరాల్లో రూ.1,405 కోట్లతో దీనిని నిర్మించారు.

రెడ్ డైరీ అనేది ఏదీ లేదు: గెహ్లాట్ 

మోదీ ‘రెడ్ డైరీ’ కామెంట్లకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కౌంటర్ ఇచ్చారు. ‘‘రెడ్ డైరీ అనేది ఒక ఊహ. అసలు రెడ్ డైరీ అంటూ ఏదీ లేదు. ప్రధాని ఊహాజనిత రెడ్ డైరీని చూస్తున్నారు.. కానీ ధరలు అధికంగా పెరిగిన రెడ్ టమాటాలు, రెడ్ సిలిండర్లను మాత్రం చూడలేకపోతున్నారు. వాటి ధరలు చూసి ఎర్రగా మారిన ప్రజల ముఖాలూ ఆయనకు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజలు రెడ్ ఫ్లాగ్ చూపిస్తారు” అని అన్నారు.