నేషనల్​ గేమ్స్​ను ప్రారంభించిన ప్రధాని మోడీ

నేషనల్​ గేమ్స్​ను ప్రారంభించిన ప్రధాని మోడీ

అహ్మదాబాద్‌‌‌‌: కళ్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్‌‌..  కలర్‌‌ఫుల్‌‌ డెకరేషన్స్‌‌.. డీజే సౌండ్స్‌‌.. సాంప్రదాయ నృత్యాలు.. మెలోడీ గీతాలు.. ప్రపంచ స్థాయి అథ్లెట్లు.. రాజకీయ ప్రముఖుల మధ్య.. 36వ జాతీయ క్రీడలు అట్టహాసంగా మొదలయ్యాయి. మొతెరా స్టేడియంలో లక్ష మంది సమక్షంలో గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ గేమ్స్‌‌ను అధికారికంగా ప్రారంభించారు. గుజరాత్‌‌ స్విమ్మింగ్‌‌ స్టార్‌‌ మానా పటేల్‌‌.. ‘యూనిటీ ఆఫ్‌‌ స్టాచ్యూ’ సింబాలిక్‌‌ టార్చ్‌‌ను ప్రధానికి అందజేసింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా దానిని వెలిగించడం కోసం ప్రధాన మంత్రి పోడియంపై జ్యోతిని ఉంచారు. వెంటనే గ్రౌండ్‌‌లో సర్దార్‌‌ వల్లభాయ్‌‌ పటేల్‌‌ ప్రతిమతో కూడిన పెద్ద టార్చ్‌‌ ఆవిష్కృతం కావడంతో గేమ్స్‌‌ మొదలైనట్లు ప్రకటించారు. ఒలింపిక్‌‌ చాంపియన్లు పీవీ సింధు, నీరజ్‌‌ చోప్రా, రవి దహియా, మీరాబాయి చాను, గగన్‌‌ నారంగ్‌‌, హాకీ మాజీ కెప్టెన్‌‌, హెచ్‌‌ఐ ప్రెసిడెంట్‌‌ దిలీప్‌‌ టిర్కీ, అంజూ బాబీ జార్జ్‌‌తో సహా పలువురు క్రీడా లెజెండ్స్‌‌ ఇందులో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ అద్భుత దృశ్యాన్ని, వాతావరణాన్ని మాటల్లో వర్ణించలేం. వరల్డ్‌‌ లార్జెస్ట్‌‌ స్టేడియంలో ఇండియా అతిపెద్ద క్రీడా ఉత్సవాన్ని చూస్తోంది’ అని అన్నారు.

ఈ మధ్య ఒలింపిక్స్‌‌‌‌, కామన్వెల్త్‌‌  వంటి మెగా ఈవెంట్లలో మెడల్స్‌‌ సాధించిన ఇండియా అథ్లెట్లను ప్రశంసించిన మోడీ..  ఆటల్లో బంధుప్రీతి, అవినీతి కారణంగా క్రీడాకారులు గతంలో ప్రపంచ వేదికలపై రాణించలేకపోయారన్నారు. కానీ, 2014 తర్వాత ఈ పరిస్థితి మారిందన్నారు.  ‘దేశంలో గతంలో కూడా టాలెంటెడ్‌‌ ప్లేయర్లు ఉన్నారు.   కానీ, ప్రొఫెషనలిజం బదులు ఆటల్లో బంధుప్రీతి, అవినీతి రాజ్యమేలింది. మేం ఈ వ్యవస్థను శుభ్రపరిచి, యువతలో కొత్త విశ్వాసాన్ని నింపాము. గత 8 ఏళ్లలో దేశంలో స్పోర్ట్స్‌‌ బడ్జెట్‌‌ 70 శాతం పెరిగింది. గతంలో వంద కంటే తక్కువ ఇంటర్నేషనల్‌‌ ఈవెంట్లలో పాల్గొన్న అథ్లెట్లు.. ఇప్పుడు 300 టోర్నీల్లో బరిలోకి దిగుతున్నారు’ అని ప్రధాని పేర్కొన్నారు.  నేషనల్ గేమ్స్‌‌ ప్రతి యువకుడికి లాంచ్‌‌ ప్యాడ్‌‌గా ఉపయోగపడతాయన్నారు.

తెలంగాణ ఫ్లాగ్‌‌ బేరర్‌‌గా రష్మీ రాథోడ్​

సాయంత్రం 4 గంటలకు మొదలైన ఓపెనింగ్‌‌ సెర్మనీ.. రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. సింగర్స్​ మోహిత్‌‌ చౌహాన్‌‌, శంకర్​ మహదేవన్​ తమ పాటలతో ఫ్యాన్స్‌‌ను ఉర్రూతలూగించారు.  ‘వందే గుజరాత్‌‌ పేరుతో’ 600 మంది స్థానిక కళాకారులు, గాయకుల ప్రదర్శన ఆకట్టుకుంది.  గేమ్స్‌‌లో పాల్గొంటున్న 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు సర్వీసెస్‌‌కు చెందిన అథ్లెట్లతో ‘ఏక్‌‌ భారత్‌‌’ అనే థీమ్‌‌తో మార్చ్‌‌ఫాస్ట్‌‌ను నిర్వహించారు. ఇందులో తెలంగాణ బృందానికి  సీనియర్​ షూటర్‌‌ రష్మీ రాథోడ్​ ప్లాగ్‌‌ బేరర్‌‌గా వ్యవహరించింది. ఏపీ టీమ్​ను స్టార్‌‌ ఆర్చర్‌‌ వెన్నం జ్యోతి సురేఖ ముందుండి నడిపించింది. 

నెట్‌బాల్‌ ఫైనల్లో తెలంగాణ

నెట్‌బాల్‌లో తెలంగాణ మెన్స్‌ టీమ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో మన జట్టు 55–53 తేడాతో ఆతిథ్య గుజరాత్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. మరో సెమీస్‌లో నెగ్గిన హర్యానాతో తెలంగాణ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. కానీ,  విమెన్స్‌ టెన్నిస్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలంగాణ క్వార్టర్‌ ఫైనల్లో 0–2తో గుజరాత్‌ చేతిలో ఓడిపోయింది.