ప్రశ్నించొద్దు.. పకోడీలు వేస్కోవాలి.. ప్రధాని మోదీ యువతను పక్కదారి పట్టిస్తున్నారు

ప్రశ్నించొద్దు.. పకోడీలు వేస్కోవాలి.. ప్రధాని మోదీ యువతను పక్కదారి పట్టిస్తున్నారు
  • యువత నుంచి ప్రధాని ఆశిస్తున్నది ఇదే.. మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్
  • యువతను పక్కదారి పట్టించాలని చూస్తున్నరని విమర్శ
  • సీబీఎస్​ఈ టెండర్లలో అవినీతి బయటపెట్టిన స్టూడెంట్లకు అభినందన
  • సీబీఐ కంటే వేగంగా పనిచేశారని ప్రశంస
  • కేంద్ర విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలి
  • ఈ వ్యవహారంపై స్వతంత్ర జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలోని యువత ఎలాంటి ప్రశ్నలు అడగకుండా.. కండ్లు మూసుకొని కేవలం రీల్స్ చేసుకోవాలని, పకోడీలు వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా యువతను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీబీఎస్‌‌‌‌ఈ ఆన్‌‌‌‌స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ (ఓఎస్‌‌‌‌ఎం) టెండర్లలో జరిగిన అవినీతి, అక్రమాలను బట్టబయలు చేసిన విజిల్‌‌‌‌బ్లోయర్ స్టూడెంట్‌‌‌‌ సార్థక్ సిద్ధాంత్, అతని సహచరుడు నిసర్గ అధికారిని రాహుల్ గాంధీ ఆదివారం అభినందించారు. 

దేశంలోని పెద్ద పెద్ద మీడియా సంస్థలు, దర్యాప్తు సంస్థలు కూడా చేయలేని పనిని ఈ ఇద్దరు కుర్రాళ్లు చేసి చూపించారని కొనియాడారు. గత వారం సార్థక్ సిద్ధాంత్, అతని కుటుంబ సభ్యులతో తాను జరిపిన సమావేశానికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ ‘ఎక్స్‌‌‌‌’ లో షేర్‌‌‌‌‌‌‌‌ చేశారు.


సీబీఐ కంటే వేగంగా పనిచేశారు..


సీబీఎస్‌‌‌‌ఈ ఓఎస్‌‌‌‌ఎం అవకతవకలను బట్టబటయలు చేయడంలో సార్థక్ ధైర్యాన్ని, సిద్ధాంతాలను రాహుల్‌‌‌‌గాంధీ ప్రశంసించారు. ‘‘సార్థక్‌‌‌‌కు కేవలం 18 ఏండ్లే. కానీ ఆలోచనలో, ధైర్యంలో, నైతిక విలువల్లో అతను ఎవరికీ తీసిపోడు. సీబీఎస్‌‌‌‌ఈ, కో ఎంప్ట్ సంస్థల మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని, లాలూచీని ఈ ఇద్దరు యువకులు దేశం ముందుకు తెచ్చారు. దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ కంటే ఈ 18 ఏండ్ల యువకుడు అత్యంత వేగంగా పనిచేసి నిజాలు నిరూపించాడు. యువత సాధించిన ఈ విజయం, నిజమైన అర్థంలో ప్రభుత్వానికి లభించిన ఓటమి”అని రాహుల్ పేర్కొన్నారు. 

ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా యువతను పక్కదారి పట్టించాలని మోదీ చూస్తుంటే.. ఈ యువకులు  మాత్రం ప్రశ్నించారని..సమాధానాలు కూడా వెతికారని అన్నారు. ‘‘ఇదే భారతదేశపు అసలైన యువశక్తి.. వీరు అప్రమత్తంగా ఉంటారు, సమాచారాన్ని తెలుసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, దేశ భవిష్యత్తు ఎప్పటికీ పక్కదారి పట్టదు’’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కేంద్రాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.