- నేడు స్వాభిమాన్ పర్వ్ కు హాజరు
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల గుజరాత్ పర్యటన శనివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా గిర్ సోమనాథ్ జిల్లాలోని వెరవల్ పట్టణానికి ఆయన చేరుకున్నారు. సోమనాథ్ మహాదేవ్ ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగిన ప్రధానికి సీఎం భూపేంద్ర పటేల్ స్వాగతం పలికి రిసీవ్ చేసుకున్నారు. హెలిప్యాడ్ నుంచి వీవీఐపీ సర్క్యూట్ హౌస్ కు మోదీ చేరుకున్నారు.
హెలిప్యాడ్ నుంచి సర్యూట్ హౌస్ వరకు రోడ్లకు ఇరువైపులా ప్రజలు, భక్తులు మోదీకి స్వాగతం పలికారు. సాయంత్రం సోమనాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని.. పలు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభించిన ఓంకార మంత్రజపంలో ఆయన పాల్గొన్నారు. ఆదివారం జరిగే ‘సోమనాథ్ స్వాభిమాన్ శౌర్య యాత్ర’కు ఆయన హాజరుకానున్నారు.
ఈ యాత్రలో 108 గుర్రాలను ఊరేగిస్తారు. మొఘల్ దురాక్రమణదారుడు గజినీ మొహమ్మద్.. సోమనాథ్ ఆలయంపై 1026వ సంవత్సరంలో దాడి చేశాడు. ఆలయాన్ని కాపాడే క్రమంలో కొన్నివేల మంది తమ ప్రాణాలు ధారపోశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శౌర్యయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని రాజ్ కోట్ కు చేరుకుంటారు.
రాజ్ కోట్ లో వైబ్రెంట్ గుజరాత్ కు హాజరు
రాజ్ కోట్ లో ఆదివారం జరిగే వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించనున్నారు. అలాగే, రాజ్ కోట్ లోని గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (జీఐడీసీ) లిమిటెడ్ ను ఆయన ప్రారంభిస్తారు. తర్వాత రాజ్ కోట్ నుంచి అహ్మదాబాద్ కు వెళ్తారు.
ఈ సందర్భంగా గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ మెట్రో స్టేషన్ లో సాయంత్రం 5.15 గంటలకు అహ్మదాబాద్ మెట్రో రెండో దశను ప్రధాని స్టార్ట్ చేస్తారు. మూడో రోజు సోమవారం జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తో ప్రధాని భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు అధినేతలూ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం భారత్, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు.
సోమనాథ్ ఆలయం.. మన ఆత్మగౌరవానికి ప్రతీక
హైదరాబాద్, వెలుగు: సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ గుడిని కాపాడుకునేందుకు ఎంతో మంది నెత్తురు చిందించారని.. ప్రాణాలను లెక్కచేయకుండా కొట్లాడారని తెలిపారు. వాళ్ల త్యాగాలను యాది చేసుకునేందుకే స్వాభిమాన పర్వ్ నిర్వహిస్తున్నామని చెప్పారు.
‘సోమనాథ్ స్వాభిమాన పర్వ్–2026’ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట దుర్గాభవానీ ఆలయంలో శివుడికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
సోమనాథ్ ఆలయాన్ని రక్షించేందుకు ప్రాణాలర్పించిన వారి త్యాగాలు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. ధర్మం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారిని మరువకూ డదన్నారు. మరోవైపు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సి టీలోని శివాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అభిషేకాలు చేశారు.
