సెమీకండక్టర్ మార్కెట్‌‌లో సత్తా చాటుతాం: ప్రధాని మోదీ

సెమీకండక్టర్ మార్కెట్‌‌లో సత్తా చాటుతాం: ప్రధాని మోదీ
  • ఈ ఏడాది 5 ప్రాజెక్టులకు ఓకే చెప్పాం
  • ఇప్పటికే రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు
  • ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

న్యూఢిల్లీ: ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్‌‌లో ఇండియా భారీ వాటాను దక్కించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్ సైజు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన అన్నారు. భారతదేశంలో సెమీకండక్టర్ల తయారీకి వేగంగా ఆమోదాలు ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని  తెలిపారు. 

ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన 'సెమికాన్ ఇండియా 2025' వార్షిక సెమీకండక్టర్ సదస్సులో పీఎం మాట్లాడుతూ, ఇండియా సెమీకండక్టర్ మిషన్ తదుపరి దశ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కొన్ని దేశాలు సొంత ప్రయోజనాల కోసం బిజీగా ఉండగా, మనదేశం 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించిందంటూ పరోక్షంగా ట్రంప్​ టారిఫ్​లను విమర్శించారు.

 ‘‘ఈ ఏడాది మరో ఐదు ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చాం. దీంతో మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 10కి చేరింది. ఈ ప్రాజెక్టులకు 18 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. ఇది భారతదేశంపై ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. సెమీకండక్టర్లు, చిప్‌‌లు "డిజిటల్ డైమండ్స్" వంటివి. గత శతాబ్దంలో ముడి చమురు కీలక పాత్ర పోషించినట్టే, ఈ 21వ శతాబ్దంలో  ఇవి కీలకం అవుతాయి’’ అని మోదీ అన్నారు. 

సెమీకండక్టర్ల ఫ్యాక్టరీలకు త్వరగా అనుమతులు ఇవ్వడానికి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్‌‌ను అమలు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ విధానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని ఆమోదాలను ఒకే ప్లాట్‌‌ఫారమ్‌‌లో పొందడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.  భారతదేశంలో డిజైన్, తయారు చేసిన చిప్స్​ను ప్రపంచం గుర్తించే రోజులు ఎంతో దూరంలో లేవని  అన్నారు.   

ఇదిలా ఉంటే, పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఇస్రో, సెమీకండక్టర్​ లాబ్​ కలిసి తయారు చేసిన విక్రమ్​–32 సెమీకండక్టర్​ చిప్​ ఈ సందర్భంగా ప్రదర్శించారు. అంతరిక్ష పరిశోధన సహా పలు పనుల కోసం దీనిని ఉపయోగిస్తారు.