70 ఏండ్లుగా కాంగ్రెస్ దేశాన్ని దోచుకుంటోంది : ప్రధాని నరేంద్ర మోదీ

70 ఏండ్లుగా కాంగ్రెస్ దేశాన్ని దోచుకుంటోంది : ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ లీడర్లు 70 ఏండ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ పార్టీ ఎంపీ ధీరజ్ సాహు ఆఫీసు, ఇండ్ల నుంచి రూ.353.50 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోవడమే దీనికి నిదర్శమని ట్విట్టర్​లో విమర్శించారు. ‘మనీ హైస్ట్’ అనే పాపులర్ క్రైమ్ సిరీస్ డ్రామాను మోదీ ప్రస్తావించారు. ఇప్పటి దాకా ఇంత పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ పట్టుబడలేదన్నారు.

కాంగ్రెస్ ఉండగా.. ‘మనీ హైస్ట్’ అవసరం ఎవరికి ఉందని ప్రశ్నించారు. ‘‘70 ఏండ్లుగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీ దోచుకుంటున్నది. ఇండియాలో ‘మనీ హైస్ట్’ స్టోరీలు ఎవరికి అవసరం?” అని  ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు. కాంగ్రెస్ ప్రెజెంట్ మనీ హైస్ట్.. అనే క్యాప్షన్​తో బీజేపీ షేర్ చేసిన వీడియోను ప్రధాని మోదీ షేర్​ చేశారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో ధీరజ్ సాహు ఉన్న ఫొటోలను బీజేపీ ట్విట్టర్​లో షేర్ చేసింది. ఒడిశా, జార్ఖండ్‌‌, కోల్‌‌కతాలో  లిక్కర్ వ్యాపారం చేసే కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. రికార్డు స్థాయిలో రూ.353.50 కోట్ల నగదు, 3 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అదానీ వ్యవహారంపై మాట్లాడాలె: జైరామ్

ప్రధాని మోదీ కామెంట్లను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ ఖండించారు. ఎన్​డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి అయిందని, దీనికి వెనుక ఎవరి హస్తం ఉందని ఆయన మోదీని ప్రశ్నించారు. 1947 తర్వాత జరిగిన ఈ అతిపెద్ద దోపిడీ గురించి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. చాంగ్ చుంగ్ లింగ్, అదానీ గ్రూప్​కు మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు. దీన్ని డైవర్ట్ చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద ‘మనీ హైస్ట్’ గురించి చెప్పాలన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీల సాయంతో అదానీ గిఫ్ట్​గా ఇచ్చిన ప్రాజెక్టుల్లో మోదీ పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ‘‘ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు అతను ఎలా అయ్యాడు? అంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఎవరు?”అంటూ గౌతమ్ అదానీ ఉద్దేశిస్తూ మోదీపై జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు.