జిల్లాలు, గ్రామాల అభివృద్ధితోనే.. దేశం డెవలప్ అయితది

జిల్లాలు, గ్రామాల అభివృద్ధితోనే..  దేశం డెవలప్ అయితది
  • చత్తీస్​గఢ్​ను ఎంతో అభివృద్ధి చేశాం: ప్రధాని మోదీ
  • రూ.26 వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్​లకు శంకుస్థాపన

జగదల్​పూర్(చత్తీస్​గఢ్): రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం డెవలప్ అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. కేంద్రంలో ఎన్​డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని వివరించారు. మంగళవారం చత్తీస్​గఢ్​లో మొత్తం రూ.26 వేల కోట్లు విలువ చేసే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 

పలు ప్రాజెక్ట్​లను జాతికి అంకితం చేశారు. దీనికి ముందు 52 శక్తి పీఠాల్లో ఒకటైన జగదల్​పూర్​లోని బస్తర్ దంతేశ్వరీ ఆలయాన్ని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత జగదల్​పూర్​లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని మాట్లాడారు. బీజేపీ హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి చేసిందేమీలేదని విమర్శించారు. 

2014తో పోలిస్తే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపులు 20 రెట్లు పెరిగాయన్నారు. తొమ్మిదేండ్లలో చత్తీస్​గఢ్ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరించిందని వివరించారు. బస్తర్ జిల్లా నగర్నార్​లో రూ.23,800 కోట్లతో నిర్మించబోయే ఎన్​ఎండీసీ స్టీల్ లిమిటెడ్ ప్లాంట్​తో 50వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. మారుమూల ప్రాంతాలన్నీ డెవలప్ అయితేనే.. దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.