తెలంగాణాలో బీసీని సీఎం..చేసేది మేమే : నరేంద్ర మోదీ

తెలంగాణాలో బీసీని సీఎం..చేసేది మేమే : నరేంద్ర మోదీ
  •     బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఎన్నటికీ చేయవు
  •     ఆ రెండింటికీ కుటుంబ పాలనే ముఖ్యం: మోదీ
  •     బీఆర్​ఎస్​ అవినీతి ఢిల్లీ దాకా పాకింది
  •     లిక్కర్​ స్కామ్​లో ఎవర్నీ వదలం.. ఇది నా గ్యారంటీ
  •     కేసీఆర్​లో అహంకారం పెరిగింది.. దర్యాప్తు సంస్థలనూ తిడ్తున్నరు
  •     జనం నుంచి దోచుకున్న సొమ్మునంతా రాబడ్తం
  •     బీసీ వ్యతిరేక బీఆర్​ఎస్​ సర్కార్​ను కూకటివేళ్లతో పెకిలిద్దాం 
  •     ఎల్బీ స్టేడియంలో ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో ప్రసంగం

హైదరాబాద్, వెలుగు : బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు కుటుంబ పార్టీలని.. వాటికి కుటుంబపాలన, అవినీతి తప్ప బీసీల గోస పట్టదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయాల్లోనే కాదు ఏ రంగంలోనూ బీసీలకు ఆ పార్టీలు అవకాశం కల్పించవని, బీసీలంటే వాటికి చిన్నచూపని మండిపడ్డారు. బీసీని సీఎం చేసేది బీజేపీ మాత్రమేనని.. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఎన్నటికీ బీసీని సీఎం చేయవని, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తాయని అన్నారు. దేశంలో తొలిసారి ఒక బీసీని ప్రధానమంత్రిగా చూస్తున్నామని, ఇప్పుడు తెలంగాణలోనూ బీసీని సీఎం చేసుకుందామని, బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు.

 బీఆర్​ఎస్​ నేతల్లో అహంకారం పెరిగిపోయిందని, ప్రజలే వాళ్లకు తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు.  ‘‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో అన్నివర్గాలను కేసీఆర్​ మోసం చేసిండు. కుటుంబం కోసమే పనిచేస్తున్నడు. ఈ అహంకారి సీఎంకు 2019 లోక్​సభ ఎన్నికల్లో ఓటుతో ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీసీ వ్యతిరేక బీఆర్​ఎస్​ సర్కార్​ను కూకటివేళ్లతో పెకిలిద్దాం” అని అన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

ఈ స్టేడియంలోనే నన్ను ఆశీర్వదించి ప్రధానిని చేశారు

2013లో ఎల్బీ స్టేడియంలో జరిగిన సభకు తాను వచ్చానని, ఇదే వేదిక నుంచి జనం ఆశీర్వదించి తనను ప్రధానమంత్రిని చేశారని మోదీ గుర్తుచేసుకున్నారు. ఇక్కడికి రావడం కుటుంబసభ్యుల మధ్యకు వచ్చినట్లు ఉందని అన్నారు.  ‘‘ఎల్బీ స్టేడియంతో నా జీవితం ముడిపడి ఉంది.  2013లో మీరు నన్ను(ప్రజలు) ఈ స్టేడియానికి రప్పించారు. టికెట్‌‌ కొని మరీ సభకు వచ్చి ప్రపంచానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చారు. నాడు మీరిచ్చిన ఆశీర్వాదంతోనే నేను ప్రధాని అయ్యాను.. ఇదే స్టేడియం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నరు” అని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మార్పు తుఫాన్​ రాబోతున్నదని చెప్పారు. ‘‘రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా ప్రగతి విరోధక.. బీసీ వ్యతిరేక.. ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక సర్కార్​ నడుస్తున్నది. ఈ బీసీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ నెల 30న జరిగే పోలింగ్​లో కూకటివేళ్లతో పెకిలిద్దాం.. బీజేపీ డబుల్​ ఇంజన్​ సర్కార్​ను తెచ్చుకుందాం” అని ఆయన అన్నారు.

తెలంగాణ పోరులో బీసీలది కీలక పాత్ర

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజలు పోరాటం చేశారని మోదీ గుర్తుచేశారు. తెలంగాణ పోరులో బీసీలది కీలక పాత్ర అని, ఎందరో ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం బీసీలకు దోఖా చేసిందని, కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నదని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన టైమ్​ వచ్చిందని అన్నారు.  ‘‘ఇక్కడి ప్రభుత్వం.. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. ఎప్పుడూ కుటుంబం కోసమే పనిచేస్తున్నది. అహంకార సీఎంకు బీసీలు ఓటుతో బుద్ధి చెప్పాలి. ఈ మోసాల సర్కార్ పోవాల్నా వద్దా.. కేసీఆర్​ సర్కార్​ను ఓడించాల్నా వద్దా?” అని ఆయన పేర్కొన్నారు. 

బీఆర్​ఎస్​కు కాంగ్రెస్ సీ టీమ్​

కాంగ్రెస్​, బీఆర్ఎస్​ రెండింటి డీఎన్ఏలు ఒకటేనని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ రెండు పార్టీల్లో మూడు అంశాలు కామన్​గా ఉంటాయని,  అందులో ఒకటి: కుటుంబ పాలన, రెండు: అవినీతి, మూడు: బుజ్జగింపు రాజకీయాలు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్​ పార్టీ బీఆర్​ఎస్​కు సీ టీమ్​ అని ఆరోపించారు. ‘‘ఈ కుటుంబ పార్టీలు ఏనాడూ బీసీ, బడుగు బలహీనవర్గాల వారిని రాజకీయంగా ఎదగనివ్వవు. వాళ్ల వాళ్ల స్వార్థం కోసమే పనిచేస్తుంటాయి. ఇవి ఏనాడూ బీసీలను సీఎంను చేయవు. బీజేపీ ఒక్కటే బీసీని సీఎం చేసే పార్టీ” అని తెలిపారు. 

అవినీతిపరులను విడిచిపెట్టం

రాష్ట్రాన్ని బీఆర్​ఎస్​ లూటీ చేసిందని మోదీ ఆరోపించారు. అవినీతిపరులను తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇందుకోసం కార్యాచరణ జరుగుతున్నదని తెలిపారు. ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నరో వారి నుంచి అంతా రాబడుతామని చెప్పారు. బీఆర్​ఎస్​ అవినీతి ఢిల్లీ వరకు పాకిందని, లిక్కర్​ స్కామ్​తో బీఆర్​ఎస్​ నేతలకు సంబంధాలు ఉన్నాయని మోదీ అన్నారు. లిక్కర్​ స్కామ్​పై ఈడీ, సీబీఐ దర్యాప్తు జరుపుతున్నాయని, దర్యాప్తు సంస్థలను కూడా బీఆర్​ఎస్​ నేతలు తిడుతున్నారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ ప్రజలకు ఇదీ మోదీ గ్యారంటీ.. అవినీతిపరులను వదలిపెట్టేది లేదు. దోచుకున్నవాళ్లను సహించేది లేదు” అని ఆయన అన్నారు. 

ఒక తరం భవిష్యత్తును బీఆర్​ఎస్​ నాశనం చేసింది 

నిరుద్యోగులను కేసీఆర్​ సర్కార్​ నిండా ముంచిందని మోదీ ఫైర్​ అయ్యారు. ‘‘ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్​ఎస్​ పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది.. కానీ, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగులు, యువత ఆశలను అడియాసలు చేసింది. టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీలతో నిరుద్యోగుల గోస పుచ్చుకుంది. ఒక తరం భవిష్యత్తును నాశనం చేసింది. యువతను మోసం చేసిన బీఆర్​ఎస్​ సర్కార్​ను ఇంటికి పంపాలి” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో నియామక పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలు కామన్ అయ్యాయని విమర్శించారు. టీచర్ పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని అన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి బీఆర్​ఎస్​ సర్కార్​ మోసం చేసిందని, బీసీలకు ఏడాదికి రూ.1,000 కోట్ల ఫండ్స్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. 

బీసీలకు అండగా బీజేపీ

బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమేనని మోదీ అన్నారు. కేంద్ర కేబినెట్ లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారని తెలిపారు. అంతేకాదు.. పార్లమెంట్‌‌లో దాదాపు 85 మందికి పైగా బీసీ ఎంపీలు ఉన్నారని వెల్లడించారు. అబ్దుల్‌‌ కలామ్‌‌, రామ్‌‌నాథ్‌‌ కోవింద్‌‌, ద్రౌపది ముర్ము వంటి బడుగు బలహీనవర్గాల వారిని రాష్ట్రపతిని చేసింది బీజేపీనేనని చెప్పారు. ఆదివాసీ నేత పీఏ సంగ్మాను, దళిత నేత జీఎంసీ బాలయోగిని లోక్‌‌ సభ స్పీకర్‌‌ను చేసిందీ బీజేపీనేనని అన్నారు. ఇదే క్రమంలో..  దేశంలో మొట్టమొదటగా ఓబీసీని ప్రధానిని చేసిన ఘనత కూడా బీజేపీకే దక్కిందని తెలిపారు. మెడికల్, డెంటల్ సీట్లలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని,  సామాజికన్యాయం దిశగా తమ కమిట్‌‌మెంట్‌‌కు ఇది ప్రతీక అని అన్నారు.

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద బీసీల్లోని వడ్రంగి, కంసాలి, కమ్మరి, కుమ్మరి, నాయీబ్రాహ్మణ, రజక తదితర వృత్తులవారి కోసం రూ.13వేల కోట్లు కేటాయించామని చెప్పారు. బీసీలను బీజేపీ తప్ప ఏ పార్టీ  పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు రావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, తప్పక బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, దేశంలో ఏ ఒక్క నిరుపేద కూడా ఆకలితో కడుపు మాడ్చుకోవద్దని మరో ఐదేండ్ల పాటు ఉచిత రేషన్​ అమలు చేస్తున్నామని ప్రధాని వివరించారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ.. సెల్​ఫోన్ల టార్చ్​ను ఆన్​ చేయాలని సభకు వచ్చినవారికి  మోదీ సూచించగా.. అక్కడి వారంతా టార్చ్​ ఆన్​ చేసి మద్దతు తెలిపారు. కాగా, ప్రధాని మోదీ తన ప్రసంగంలో సమ్మక్క--సారలమ్మ, యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామిని స్మరించుకున్నారు. ‘నా కుటుంబసభ్యులారా’ అంటూ తెలుగులో ప్రసంగించారు.  

ఓపెన్​ టాప్​ వాహనంలో వేదిక వద్దకు

ప్రధాని నరేంద్రమోదీకి ఎల్బీ స్టేడియంలో ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక ఓపెన్‌‌ టాప్‌‌ వాహనంలో మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ కలిసి రాగా.. కార్యకర్తలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. సభలో జనసేన అధినేత పవన్​ కల్యాణ్, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్​, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్​ తదితరులు పాల్గొన్నారు.   

మోదీకి దేశ ప్రయోజనాలే ముఖ్యం : పవన్ కళ్యాణ్

దేశ ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ పని చేశారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. మూడు సార్లు గుజరాత్ సీఎంగా చేసిన అనుభవం ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఎన్నికలే లక్ష్యంగా పని చేసి ఉంటే ట్రిపుల్ తలాక్, మహిళా రిజర్వేషన్ బిల్లు, రామ మందిరం, నోట్లరద్దు వంటి సంచలన నిర్ణయాలు అమలయ్యేవి కాదన్నారు. ఆత్మగౌరవం నింపే వ్యక్తినే తాను కోరుకున్నానని, అందుకే మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. వేలాది మంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందన్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు అందరికీ అందాయా.. అన్నది ప్రశ్నించుకోవాలని సూచించారు. తెలంగాణ, ఆంధ్రా లీడర్లు మోదీని అర్థం చేసుకుని సయోధ్య కుదుర్చుకోవచ్చన్నారు. నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 2014, 2023లో ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.  మోదీయే మళ్లీ ప్రధాని అవుతారని తెలిపారు.

బీసీలు తగ్గేదేలే : బండి సంజయ్

ఆత్మగౌరవ సభకు వచ్చిన జనాన్ని చూసి కేసీఆర్​కు గుండె దడ వస్తున్నదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీసీల్లో ఐక్యత లేదని కొన్ని పార్టీల లీడర్లు అవమానిస్తున్నారని మండిపడ్డారు. బీసీలు కులాల వారీగా చీలిపోయారని, వారికి ఏం చేసినా దండగే అనే కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ.. బీసీ అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. బీసీలు అస్సలు తగ్గేదే లే అన్నట్లు వ్యవహరించాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ మోదీని బాస్​గా భావిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని తెలిపారు.

ఆ మూడు పార్టీలు ఒకే తాను ముక్కలు :  కిషన్ రెడ్డి 

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకే తాను ముక్కలు అని కిషన్ రెడ్డి విమర్శించారు. 2004 నుంచి కాంగ్రెస్​తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందన్నారు. 2014, 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​కు అమ్ము డు పోయారని చెప్పారు. వాళ్లంతా మంత్రు లు అయ్యారన్నారు. కాంగ్రెస్ అమ్ముడుపో యే పార్టీ అని, బీఆర్ఎస్ కొనే పార్టీ అని విమర్శించారు. రెండు పార్టీల పాలనలో అంతా అవినీతే జరిగిందన్నారు. రెండు పార్టీల  డీఎన్ఏ ఒకటే అని, మజ్లిస్​ను పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో మార్పు రావాలంటే, బతుకులు బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు. 

బీజేపీని గెలిపిస్తే.. బీసీనే సీఎం : లక్ష్మణ్

బీజేపీ అభ్యర్థులను గెలిపించి బీసీ వ్యక్తిని సీఎంను చేయాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు. బీసీ సీఎం అని ప్రకటించినప్పటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని అన్నారు. బీసీ సీఎం ఎట్ల అవుతడు.. ఎట్ల గెలుస్తరని అవమాని స్తున్నారని చెప్పారు. బీసీలంతా ఏకమై కాంగ్రెస్, బీఆర్ఎస్​కు బుద్ధి చెప్పాలన్నారు. కనీస అవగాహన లేకుండా రాహుల్ విమ ర్శిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు గుణం లేదంటూ కేటీఆర్ అవమానిస్తు న్నారన్నారు. ఫాం హౌజ్ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టి.. ప్రజలకు అందుబాటులో ఉండే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. 

బీఆర్​ఎస్​ నేతల్లో అహంకారం పెరిగిపోయింది. ఈ అహంకార సీఎంకు 2019 లోక్​సభ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం చెప్తారు. బీఆర్​ఎస్​ నేతల అవినీతి.. ఢిల్లీ దాకా పాకింది. లిక్కర్​ స్కామ్​లోనూ వీళ్లకు లింకులున్నాయి. దీనిపై విచారణ జరుగుతున్నది. దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐపై కూడా ఇక్కడి నేతలు ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు. నోటికొచ్చినట్లు తిడుతున్నరు. తెలంగాణ ప్రజలకు నేను గ్యారంటీ ఇస్తున్న.. తప్పు ఎవరుచేసినా శిక్ష అనుభవించాల్సిందే. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దోచుకున్న జనం సొమ్మును రాబడ్తం.

 ప్రధాని నరేంద్రమోదీ