
న్యూఢిల్లీ: భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే ఐదేండ్లలో ఇండియా టాప్3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని, ఇది తన గ్యారంటీ అని చెప్పారు. అవినీతి, కుటుంబ, బుజ్జగింపు రాజకీయాలపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మూడు ఈవిల్స్ దేశాన్ని కోలుకోలేనంతగా దెబ్బతీశాయని అన్నారు. 77వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధాని ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి 90 నిమిషాలపాటు సుదీర్ఘంగా మోదీ ప్రసంగించారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే వచ్చే ఆగస్టు 15న కూడా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తానని అన్నారు. ముందుగా మణిపూర్ హింసపై మాట్లాడిన ప్రధాని.. ప్రస్తుతం అక్కడ శాంతి నెలకొంటున్నదని చెప్పారు. రోగుల మందుల ఖర్చులను తగ్గించేందుకు జన్ ఔషధి కేంద్రాలను పెంచుతామని వెల్లడించారు. మధ్య తరగతి ప్రజలు ఇండ్లు కట్టుకునేందుకు బ్యాంకు లోన్లను మంజూరు చేస్తామని తెలిపారు.
మూడు ఈవిల్స్‌పై యుద్ధం చేయాలి
అవినీతి, కుటుంబ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలనే మూడు ఈవిల్స్ దేశాన్ని కోలుకోలేనంతగా దెబ్బతీశాయని ప్రధాని మోదీ అన్నారు. ఇవి దశాబ్దాలుగా వ్యవస్థలో భాగమయ్యాయని, ప్రజలు వాటిని మరిచిపోవడం మొదలైందని చెప్పారు. ‘‘ఈ మూడు ఈవిల్స్‌పై కన్నేయాలి. యుద్ధం చేయాలి. అభివృద్ధి చెందిన దేశంగా ఉద్భవించాలంటే.. అవినీతి ఏ రూపంలో ఉన్నా వదిలిపెట్టకూడదు. చెదపురుగుల మాదిరే అవినీతి కూడా దేశంలోని వ్యవస్థలను, వాటి సామర్థ్యాలను గుల్లచేసింది. ప్రతి రంగంలోని అవినీతిపై పోరాడటం చాలా ముఖ్యం” అని మోదీ చెప్పారు. కుటుంబ పార్టీలు.. ‘కుటుంబం చేత, కుటుంబం వల్ల, కుటుంబం కోసం’ అనే మంత్రంతో పని చేశాయని విమర్శించారు. ‘పరివార్వాద్’ (కుటుంబ రాజకీయాలు) దేశంపై తన పట్టును బిగించి, ప్రజల హక్కులను హరించివేశాయని మండిపడ్డారు.
ప్రతి నిర్ణయం వెయ్యేండ్లపై ప్రభావం చూపుతది
గతంలో రాజకీయ అస్థిరత ఉండేదని ప్రధాని అన్నారు. ఇప్పుడు ‘విశ్వ మిత్ర’గా ఇండియా అవతరిస్తున్నదని అన్నారు. సంస్కరణలు, పనితీరు, పరివర్తన దేశాన్ని మారుస్తున్నాయని చెప్పారు. ‘‘వచ్చే ఐదేండ్లు.. అపూర్వమైన అభివృద్ధి కాలం. 2047 నాటికి ‘డెవలప్డ్ ఇండియా’ కలను సాకారం చేయడంలో సువర్ణ కాలంగా నిరూపితమవుతుంది” అని మోదీ అన్నారు. వచ్చే ఐదేండ్లలో ఇండియా టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని, ఇది మోదీ గ్యారంటీ అని అన్నారు. 2047 వరకు చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం వచ్చే వెయ్యేండ్లపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాన్ని సాధించేందుకు..
సచ్చిత (నిజాయితీ), పారదర్శిత (పారదర్శకత), నిష్పాక్షతను ప్రమోట్ చేయడమనేది సమష్టి బాధ్యతని అన్నారు. ‘‘దేశాన్ని మారుస్తానని నేను ఇచ్చిన హామీతో ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. నేను ఇచ్చిన హామీ నమ్మకంగా మారి 2019లో ప్రజలు మరోసారి ఓటువేశారు. వచ్చే ఆగస్టు 15న కూడా దేశం సాధించిన విజయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సాధించిన పురోగతి గురించి మరింత ఆత్మవిశ్వాసంతో ఇదే ఎర్రకోట నుంచి మాట్లాడతా” అని ప్రధాని చెప్పారు.
మీకోసమే బతుకుతున్నా
ప్రజలు అనిశ్చితి, అస్థిరత శకానికి ముగింపు పలికారని ప్రధాని అన్నారు. 2014లో స్థిరమైన, బలమైన, పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా దేశాన్ని రాజకీయ సంకెళ్ల నుంచి విముక్తి చేశారని చెప్పారు. ‘‘నేను మీ నుంచి వచ్చాను. మీ కోసం బతుకుతున్నాను. నేను కల కన్నా కూడా అది మీ కోసమే. మీకోసం కష్టపడి పని చేస్తాను. మీరు నాకు బాధ్యత ఇచ్చారని కాదు.. మీరు నా కుటుంబం కాబట్టి ఇవన్నీ చేస్తాను. మీ కుటుంబ సభ్యుడిగా.. మీరు బాధపడితే భరించలేను. మీ కలలను అణచివేయాలని చూస్తే సహించను” అని మోదీ అన్నారు. దేశమే ముందు అనే స్ఫూర్తితో, గర్వంతో కష్టపడి పని చేస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ‘నేషన్ ఫస్ట్’నే ఆధారని వెల్లడించారు. పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయి.. వాళ్ల సంక్షేమం కోసమే ఉపయోగించేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ‘‘భారతదేశం ఆగదు.. అలసిపోదు.. తడబడదు.. ఓడిపోదు. ఇండియా ఇప్పుడు అన్‌స్టాపబుల్ అని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెబుతున్నారు” అని మోదీ చెప్పుకొచ్చారు.
శాంతితోనే పరిష్కారం
మణిపూర్‌లో హింస, మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు మెరుగవుతున్నాయని తెలిపారు. శాంతి ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరకుతుందని చెప్పారు. దేశం మొత్తం మణిపూర్ వెంట ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతిని నెలకొల్పేందుకు పని చేస్తున్నాయని అన్నారు. ‘‘కొన్ని వారాలపాటు మణిపూర్‌లో హింసాకాండ కొనసాగింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మన తల్లులు, సోదరీమణులను అగౌరవపరిచారు. ప్రస్తుతం మణిపూర్‌లో శాంతి నెమ్మదిగా తిరిగి వస్తోంది” అని చెప్పారు.
నా కుటుంబ సభ్యులారా!
ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగించడం వరుసగా ఇది పదోసారి. దాదాపు 90 నిమిషాలపాటు ఆయన ప్రసంగించారు. ఈసారి ఆయన దేశ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా సంబోధించారు. ‘‘పరివార్‌జన్’’ (కుటుంబ సభ్యులు) అంటూ స్పీచ్ ఇచ్చారు. గతంలో ‘‘నా ప్రియమైన సోదర, సోదరీమణులారా’’ అని సంబోధించేవారు.
రాజస్థానీ తలపాగా
ప్రతి ఏడు మాదిరే ఈసారి కూడా కొత్త రకంతో తలపాగాతో కనిపించారు. రాజస్థానీ బంధని ప్రింట్ తలపాగాను, ఆఫ్-వైట్ కుర్తా, వీ -నెక్ జాకెట్ ధరించారు. తలపాగా పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంది. నర్సులు, సర్పంచులు, టీచర్లు, రైతులు, మత్స్యకారులు సహా 1,800 మంది ఈ పంద్రాగస్టుకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
టైట్ సెక్యూరిటీ
పంద్రాగస్టు నేపథ్యంలో ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం వెయ్యికిపైగా ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను, యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. 10 వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తం
మారుమూల ప్రాంతాలకు అభివృద్ధిని, సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంలో చర్యలు తీసుకోవడంలో స్వయం సహాయక సంఘాల పాత్రను ప్రశంసించారు. ఇప్పుడు మహిళలకు సాధికారత కల్పించడం ద్వారా ‘2 కోట్ల మంది లక్షాధిపతులను చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ‘‘ఈ రోజు మనకు జనాభా ఉంది. ప్రజాస్వామ్యం ఉంది. వైవిధ్యం ఉంది. ఈ ‘త్రివేణి (జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం)’కి.. ప్రతి కలని నిజం చేయగల సామర్థ్యం ఉంది” అని అన్నారు. ప్రాంతీయ భాషల్లో ఉన్నత చదువులు చదువుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని ప్రధాని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో తీర్పులు చెప్పేలా చర్యలు తీసుకున్నందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ధరలను తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గత ఐదేండ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించారు.
25 వేల జన్ ఔషధి కేంద్రాలు
దేశవ్యాప్తంగా 10 వేల జన్ ఔషధి కేంద్రాలు ఉండగా.. వాటిని 25 వేలకు పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ‘‘అందరికీ జనరిక్ మందులు అందు బాటులో ఉండాలనే ఉద్దేశంతో జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. డయాబెటిస్ ఉన్న వారు ప్రతి నెల రూ.3 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే జన్ ఔషధి కేంద్రాల్లో రూ.100 విలువైన మందులు రూ.10 నుంచి 15 లోపే దొరుకుతాయి” అని వివరించారు.
ఇండ్లు కట్టుకోవడానికి లోన్లు
నగరాల్లో ఇండ్లు కట్టుకోవాలనుకునే వారికి సాయం చేసేందుకు ఓ పథకాన్ని మోదీ ప్రకటించారు. సిటీల్లో ఉండి, ఇల్లు లేని మధ్య తరగతి కుటుంబాలకు బ్యాంక్ లోన్లు ఇవ్వనున్నారు.
ఓబీసీల కోసం 15 వేల కోట్లతో స్కీమ్
ఓబీసీల కోసం ‘విశ్వకర్మ యోజన’ అనే మెగా స్కీమ్‌ను ప్రధాని ప్రకటించారు. ఇందుకోసం రూ.15 వేల కోట్ల దాకా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. కార్పెంటర్లు, స్వర్ణకారులు, తాపీ మేస్త్రీలు, రజకులు, బార్బర్లు, ఇతర సంప్రదాయ పనులు చేసే వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ స్కీమ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.