న్యూఢిల్లీ/వారణాసి : నీటి సంరక్షణలో ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే ఫలితాలనివ్వవని.. ఈ విషయంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘ప్రజలు ఓ కార్యక్రమంలో భాగమైనప్పుడు.. వాళ్లు దాని తీవ్రతను అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా ఏదైనా స్కీమ్ లేదా కార్యక్రమాన్ని ప్రజలు ఓన్ చేసుకుంటారు” అని చెప్పారు. గురువారం రాష్ట్రాల నీటి వనరుల మంత్రులతో నిర్వహించిన తొలి నేషనల్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని వర్చువల్‌గా మాట్లాడారు. నీరు.. రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయం, భాగస్వామ్యానికి సంబంధించిన అంశంగా ఉండాలని, అర్బనైజేషన్ వేగంగా జరుగుతున్న దృష్ట్యా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం.. నీటి అంశం రాష్ట్రాల నియంత్రణలో ఉంటుందని, దేశ సమష్టి లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రాల కృషి చాలా దోహదపడుతుందని చెప్పారు.
ఉపాధి హామీతో నీటి సంరక్షణ
వాటర్ విజన్ @ 2047 అనేది వచ్చే 25 ఏండ్ల అమృత్ కాల్ జర్నీకి చాలా ముఖ్యమని ప్రధాని చెప్పారు. ఉపాధి హామీ కింద చేసే పనుల్లో.. వీలైనంత ఎక్కువగా నీటి కోసం చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణపై అవగాహన పెంచాలని కోరారు. ‘‘పరిశ్రమలు, వ్యవసాయం తదితర రంగాల్లో నీటి వాడకం ఎక్కువ. అందుకే వాళ్లకు అవగాహన పెంచాలి. పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయం వంటివి చేపట్టాలి” అని పిలుపునిచ్చారు. ‘‘కేవలం ప్రభుత్వం చేసే పనులతోనే విజయం సాధించలేం. నీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో వీలైనంత మేరకు ప్రజలు, సంఘాలు, ఇతర ఎన్జీవోలు కూడా పాలుపంచుకోవాలి. ప్రజల భాగస్వామ్యం పెరిగినంత మాత్రానా.. ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గదు. ప్రజలపైనే భారం వేసినట్లు అంతకన్నా కాదు.. ఆయా కార్యక్రమాలకు ఖర్చు చేసే డబ్బు గురించి జనానికి అవగాహన కలుగుతుంది. గతంలో ప్రజలు స్వచ్ఛ భారత్ అభియాన్‌లో చేరినప్పుడు.. వారిలోనూ ఓ చైతన్యం మేల్కొన్నది” అని ఆయన గుర్తు చేసుకున్నారు.
ప్రతి జిల్లాలో 75 ‘అమృత్ సరోవర్లు’
మురికి నీటిని శుభ్రపరించేందుకు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మించామని, టాయిలెట్లు అందుబాటులోకి తెచ్చామని మోడీ చెప్పారు. అయితే మురికి అనేది ఉండకూడదని ప్రజలు అనుకుంటేనే విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి ఓ వ్యవస్థలా పని చేయాలని కోరారు. నీటిపై అవగాహన కల్పించేందుకు ‘వాటర్ అవేర్‌నెస్ ఫెస్టివల్స్’ లేదా ఇతర కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని చెప్పారు. నీటి వ్యవస్థలను పునరుద్ధరించేందుకు ప్రతి జిల్లాలో 75 ‘అమృత్ సరోవర్ల’ చెప్పున నిర్మిస్తున్నామని, ఇప్పటిదాకా 25 వేల దాకా కట్టామని వెల్లడించారు. ‘‘వాడుకున్న నీటిని మళ్లీ వాడుకుంటే.. తాజా నీటిని సంరక్షించుకుంటే.. మొత్తం ఎకో సిస్టమ్‌కు ప్రయోజనం కలుగుతుంది. అందుకే వాటర్ ట్రీట్‌మెంట్, వాటర్ రీసైక్లింగ్ అనేది చాలా ముఖ్యం” అని వివరించారు.
మోడీతో సత్య నాదెళ్ల భేటీ
నాలుగు రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చిన మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్యనాదెళ్ల.. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ‘‘సత్య నాదెళ్ల.. మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో ఇండియా ప్రోగ్రెస్.. టెక్ ఆధ్వర్యంలోని అభివృద్ధి యుగానికి నాంది పలుకుతున్నది. భూమినే మార్చగల సామర్థ్యంతో మన యువత ఆలోచనలు నిండి ఉన్నాయి” అని ప్రధాని ట్వీట్ చేశారు. డిజిటల్ ఇండియా విజన్‌ను సాధించేందుకు తమ కంపెనీ మద్దతిస్తుందని నాదెళ్ల చెప్పారు.

