మే 30న కన్యాకుమారికి మోదీ

మే 30న కన్యాకుమారికి మోదీ
  • స్వామి వివేకానంద రాక్ మెమొరియల్​లో 45 గంటల పాటు ధ్యానం
  • ప్రధాని భద్రత కోసం 2 వేల మంది పోలీసులు

కన్యాకుమారి : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తమిళనాడులోని కన్యాకుమారిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద రాక్  మెమొరియల్ లో ఆయన ధ్యానం చేయనున్నారు. గురువారం సాయంత్రం నుంచి జూన్  1 మధ్యాహ్నం 3 వరకు ధ్యాన మండపంలో మోదీ మెడిటేషన్ లో ఉండనున్నారు. ఈనెల 30న లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఆయన మెడిటేషన్  చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భద్రతను భారీగా పెంచారు. మొత్తం రెండువేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కన్యాకుమారి ప్రాంతం మొత్తాన్ని భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసినప్పుడు కూడా మోదీ.. కేదార్ నాథ్  గుహలో ధ్యానం చేశారు. .

మోదీ షెడ్యూల్..

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 30న మధ్యాహ్నం కన్యాకుమారికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి నేరుగా స్వామి వివేకానంద రాక్  మెమొరియల్ కు బయల్దేరుతారు. 45 గంటల పాటు ధ్యానంలో కూర్చుంటారు.అయితే,  ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్  నేత కపిల్  సిబల్  ఎద్దేవా చేశారు. తాను చేసిన పాపాలకు ఆయన ధ్యానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.