వందే భారత్ ట్రైన్, మెట్రోను ప్రారంభించనున్న పీఎం  

వందే భారత్ ట్రైన్, మెట్రోను ప్రారంభించనున్న పీఎం  

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్ పూర్ లో పర్యటించనున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను, నాగ్ పూర్ మెట్రో ఫస్ట్ ఫేజ్ ను ప్రారంభించనున్నారు. సిటీలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ దవాఖానను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తంగా రూ. 75 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయని ఈ మేరకు శనివారం ప్రధాన మంత్రి ఆఫీసు (పీఎంవో) వెల్లడించింది. ప్రధాని ఆదివారం ఉదయం 9.40 గంటలకు నాగ్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం సిటీ రైల్వే స్టేషన్ కు వెళతారు. నాగ్ పూర్ నుంచి బిలాస్ పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత నాగ్ పూర్ నుంచి షిర్డీకి కనెక్టివిటీ అందించే నాగ్ పూర్ మెట్రో ఫస్ట్ ఫేజ్ ‘సమృద్ధి మహామార్గ్’ను కూడా మోడీ ప్రారంభించనున్నారు. అలాగే నాగ్ పూర్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సిటీలోని మిహాన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ హాస్పిటల్ ను జాతికి అంకితం చేయనున్నారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ కు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ‘సెంటర్ ఫర్ రీసెర్చ్, మేనేజ్ మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హీమోగ్లోబినోపతీస్’ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఇన్ ఫెక్షన్లు, హీమోగ్లోబిన్ డిజార్డర్లపై ఈ రెండు సంస్థలు రీసెర్చ్ చేయనున్నాయి. అలాగే విదర్భ పట్టణంలో జరిగే పబ్లిక్ ఫంక్షన్ లో రూ. 1500 కోట్ల రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారని పీఎంవో వెల్లడించింది. మహారాష్ట్ర పర్యటన తర్వాత ప్రధాని గోవాకు వెళతారని పేర్కొంది.