- అది విమాన ప్రమాదం కాదని.. మిసైల్ తో కూల్చేశారని ఆరోపణలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నీడలో ఎదిగి.. తర్వాత ఆయనపైనే తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్ (62) మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. బుధవారం రష్యాలోని తెవర్ రీజియన్‌లోని కుజెంకినోలో విమానం కుప్పకూలడంతో ప్రిగోజిన్‌తోపాటు మరో 10 మంది చనిపోయారు. అయితే, ఇది ప్రమాదం కాదని.. మిసైల్ లేదా బాంబు దాడితో ప్రిగోజిన్‌ను చంపేశారని ఆయన అనుకూల వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచ నేతలు కూడా పుతిన్‌పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రిగోజిన్ మృతిపై పుతిన్ గురువారం పెదవివిప్పారు. రష్యన్ టీవీ చానెల్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రిగోజిన్ మంచి ట్యాలెంట్ ఉన్న వ్యక్తి అని, కానీ కొన్ని తప్పులు చేశారని పుతిన్ కామెంట్ చేశారు. కాగా, ప్రిగోజిన్ మరణవార్త తనను ఆశ్చర్యపరచలేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. ఏం జరిగిందో తెలియదని, కానీ ఊహించిందే జరిగిందన్నారు. దీనిపై ట్విట్టర్ (ఎక్స్) సీఈవో ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. ఊహిం చిన దాని కంటే ఆలస్యమైందని ట్వీట్ చేశారు. కాగా, రష్యాలో పుతిన్‌ను వ్యతిరేకించిన వారిలో చాలా మంది ఇలా గే అనుమానాస్పద రీతిలో చనిపోయారు. తక్కువ మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని చెప్తుంటారు.
