హోండురాస్ జైలులో అల్లర్లు..

హోండురాస్ జైలులో అల్లర్లు..
  • 41 మంది మహిళా ఖైదీలు మృతి
  • 26 మందిని తగలబెట్టి, మిగతా వాళ్లను పొడిచి, కాల్చి చంపిన గ్యాంగ్ 

టెగుసీగల్పా: హోండురాస్​లోని ఓ మహిళా జైలులో జరిగిన అల్లర్లలో 41మంది ఖైదీలు బలైపోయారు. తోటి ఖైదీలను ఓ గ్యాంగ్ మెంబర్లు దారుణంగా చంపేశారు. 26 మందిని బతికుండగానే తగలబెట్టేశారు. మిగతా వాళ్లను కత్తులతో పొడిచి, తుపాకులతో కాల్చి చంపారు. హోండురాస్ రాజధాని టెగుసీగల్పాకు 50 కిలోమీటర్ల దూరంలోని తమారా అనే ప్రాంతంలో ఉన్న జైలులో మంగళవారం ఈ దారుణం జరిగింది.

జైలులో వెపన్స్, డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతోనే వారు రెచ్చిపోయారని అధికారులు వెల్లడించారు. మరో ఏడుగురు మహిళా ఖైదీలను ఆసుపత్రిలో చేర్చామని, వారి పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు. జైలులో అల్లర్ల తర్వాత కత్తులు, ఇతర పదునైన ఆయుధాలు, పిస్టల్స్ వంటివి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, ఈ దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షిస్తామని  హోండురాస్ ప్రెసిడెంట్​షియోమారా క్యాస్ట్రో చెప్పారు.