జైలుకు తిరిగి వెళ్లడంపై సుప్రీంలో 49 మంది ఖైదీల పిటిషన్

జైలుకు తిరిగి వెళ్లడంపై సుప్రీంలో 49 మంది ఖైదీల పిటిషన్

ముంబై : కరోనా సమయంలో పెరోల్‌, బెయిల్‌పై విడుదలైన హత్య కేసు ఖైదీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జైలుకు తిరిగి వెళ్లాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సవాల్‌ చేశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా నేపథ్యంలో వైరస్‌ సోకకుండా ఉండేందుకు హై పవర్డ్‌ కమిటీ (హెచ్‌పీసీ) ఏర్పాటు చేసి, దోషులను జైలు నుంచి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు 2020 మార్చి 23న ఆదేశించింది. దీంతో హెచ్‌పీసీ సిఫార్సు మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం 2020 మే 8వ తేదీన ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గరిష్ఠంగా ఏడేళ్లకు పైగా జైలు శిక్ష పడిన ఖైదీలను అత్యవసర పెరోల్‌కు పరిగణించాలని పేర్కొంది. దీంతో హత్య కేసులో దోషులుగా నిర్ధారణ అయ్యి నాసిక్‌, ఔరంగాబాద్‌, అమరావతి, కొల్హాపూర్‌ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న సుమారు 49 మంది ఖైదీలు అదే ఏడాది మే నెలలో అత్యవసర పెరోల్‌పై విడుదలయ్యారు.

సుమారు రెండేళ్ల తర్వాత 49 మంది ఖైదీలు తిరిగి జైలుకు రిపోర్ట్‌ చేసి మిగతా శిక్షను కొనసాగించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక పెరోల్‌, బెయిల్‌పై విడుదలైన ఖైదీలు 15 రోజుల్లో సరెండర్‌ కావాలని ఆదేశించింది. దీంతో హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై విడుదలైన సుమారు 49 మంది ఖైదీలు ప్రభుత్వ ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో జైలుకు తిరిగి వెళ్లడం తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కరోనా అత్యవసర పెరోల్‌పై విడుదలైన 49 మంది ఖైదీల తరుపున కేసు వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది కొలిన్‌ గాన్‌స్లేవ్స్‌, ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.