రష్యాలో విమాన ప్రమాదం.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మృతి

రష్యాలో విమాన ప్రమాదం.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మృతి
  • మరో 10 మంది దుర్మరణం

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పై ఈఏడాది జూన్​లో తిరుగుబాటు చేసిన ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో చనిపోయాడు. ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్ బుధవారం తెవర్ రీజియన్​లోని కుజెంకినో గ్రామం దగ్గర కుప్పకూలింది. ఈ ప్రమాదాన్ని రష్యా అధికారులు కూడా ధ్రువీకరించారు. రష్యా ఏవియేషన్ ఏజెన్సీ ఇచ్చిన సమాచారం మేరకే ప్రిగోజిన్ చనిపోయినట్లు నిర్ధారిస్తున్నామని వివరించారు.

ఈ ప్రమాదంలో ప్రిగోజిన్​తో పాటు మరో 10 మంది చనిపోయారని వెల్లడించారు. వీరిలో ముగ్గురు సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. ప్రయాణికులతో కూడిన విమానం కుజెంకినో విలేజ్ వద్ద కూలినట్లు ముందుగా సమాచారం అందిందని వివరించారు. చనిపోయిన ప్రయాణికుల్లో ప్రిగోజిన్‌ కూడా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఎంబ్రేయర్ లెగసీ ప్రైవేట్ విమానం మాస్కో నుంచి సెయింట్ పీటర్స్​బర్గ్ వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించిందని వివరించారు. అందరూ స్పాట్​లోనే చనిపోయారని చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని రష్యా ఏవియేషన్ ఏజెన్సీ అధికారులు ప్రకటించారు. 

ప్రమాదమా? చంపేశారా?

ప్రిగోజిన్ మృతిపై సందేహాలు నెలకొన్నాయి. ఉక్రెయిన్​పై సైనిక చర్యలో భాగంగా రష్యాకు అనుకూలంగా ప్రిగోజిన్ పని చేశారు. అయితే జూన్ 23న అకస్మాత్తుగా పుతిన్​పై తిరుగుబాటు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని హెచ్చరించారు. కానీ తర్వాత బెలారస్​కు పారిపోయారు. ఇది జరిగిన రెండు నెలలకే విమాన ప్రమాదంలో ప్రిగోజిన్  చనిపోయారు. దీంతో ఆయనది ప్రమాదమా? లేక చంపేశారా? అని  సందేహాలు నెలకొన్నాయి.