- జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కరోజే 68 కేసులు నమోదు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు నిబంధనలు పాటించకుండా ప్రయాణికుల ప్రాణాల ను పణంగా పెడుతున్నారు. అధిక లాభాల కోసమే చూస్తున్నారు తప్ప ప్రయాణికుల భద్రతకు చర్యలులు మాత్రం తీసుకోవడం లేదు. కర్నూలులో బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో ప్రైవేట్ బస్సుల నిర్వాహకుల డొల్లతనం బయటపడింది. ఫిట్నెస్ లోపాలు, డిజైన్ లోపాలు, కెపాసిటీకి మించి ప్రయాణికుల తరలింపుతోపాటు ఫైర్‌సేఫ్టీ, ఫస్ట్‌ఎయిడ్ వంటి ప్రమాణాలు ఏవీ వారు పాటించడం లేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క రోజే 68 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. మరో నాలుగు బస్సులు సీజ్ చేశారు.
జరిమానాగా రూ.1.17 లక్షలు వసూలు చేశారు. విజయవాడ హైవేలో వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్‌సుక్‌నగర్, వరంగల్ హైవేలో ఉప్పల్, బెంగళూరు రోడ్డు, నాగ్‌పూర్ రూట్లోనూ మేడ్చల్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచే ప్రారంభమైన ఈ తనిఖీలు రాత్రి వర కూ కొనసాగాయి. జిల్లాల పరిధిలో కూడా అధికారు లు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఉంటాయనే అంచనా తో చాలా మంది బస్ ఆపరేటర్లు శనివారం తమ బస్సులను రోడ్లపైకి తీసుకు రాలేదు.
డిజైన్ మార్పులతో ప్రమాదాలు
తనిఖీల్లో ప్రైవేటు బస్సుల్లో పెద్దయెత్తున లోపాలు బయటపడ్డట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. గ్రేటర్హైదరాబాద్ నార్త్‌జోన్ పరిధిలో 23 కేసులు నమోదు చేయగా ఇందులో ఆయా బస్సుల సీట్ల కింద ఏర్పాటు చేసిన క్యాబిన్లలో నిబంధనలకు విరుద్ధంగా వివిధ గూడ్స్‌ను రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ గూడ్స్ బరువు వల్ల ఓవర్లోడ్అయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
వెస్ట్ జోన్ పరిధిలో 9 కేసులు, సౌత్‌జోన్ పరిధిలో 9 కేసులు, ఈస్ట్‌జోన్ పరిధిలో ఆరు కేసులు నమోదు చేయగా.. ఆయా బస్సుల్లో ఫైర్‌సేఫ్టీ లేక పోవడం, భారీఎత్తున గూడ్స్ క్యారీ చేస్తున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 14 కేసులు నమోదు కాగా.. బస్సులో సీట్లను ఇష్టం వచ్చినట్టుగా ఆల్ట్రేషన్ చేయడంతోపాటు సరైన డాక్యుమెంట్లు లేవని చెప్పారు. మేడ్చల్ జిల్లాలో ఏడు కేసులు నమోదుకాగా ఇందులో ఆరు బస్సులు అసలు టాక్సులు చెల్లించడం లేదన్నారు. ఈ సందర్భంగా ఫిట్నెస్ లేని నాలుగు బస్సులను సీజ్‌చేసినట్టు తెలిపారు.
పది నెలల్లో 877 బస్సులు సీజ్
గ్రేటర్ పరిధిలో ఆర్టీఏ అధికారులు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు అంటే 10 నెలల కాలంలో 8,848 కేసులు నమోదు చేశారు. కాంపౌండింగ్ ఫీజు రూపంలో రూ.2.28 కోట్లు వసూలు చేశారు. ఫిట్‌నెస్‌లేని కారణంగా 877 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు.
