కరోనా ఎఫెక్ట్ తో మూతపడ్డ ఆస్పత్రులు

కరోనా ఎఫెక్ట్ తో మూతపడ్డ ఆస్పత్రులు
  • ఓపీ వద్దంటే అన్ని సేవలు బంద్
  • కొన్నింట్లోమాత్రమే ట్రీట్మెంట్ సర్కార్
  • దవాఖానాలకు పెరుగుతున్న రోగులు
  • లాక్ డౌన్ తర్వాత పెరిగిన ప్రసూతి కేసులు

గత నెల వరకు ఖమ్మం నగరంలో కిటకిటలాడిన ప్రైవేట్ ఆస్పత్రులు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రతి నిత్యం పక్క జిల్లాల నుంచి కూడా వచ్చే పేషెంట్లతో కిక్కిరిసిపోయే హాస్పిటల్స్ లో ఇప్పుడు జనం కనిపించడం లేదు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కరోనా కారణంగా దాదాపు మూతబడ్డాయి. జిల్లా కేంద్రంలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగే సంఖ్యలో మాత్రమే హాస్పిటల్స్ సర్వీసులు అందిస్తున్నాయి. మిగిలిన వాటి ముందు ఓపీ చూడడం లేదంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆ బోర్డుల్లో ఓపీ మాత్రమే చూడడం లేదని చెబుతున్నా, దాదాపు ఇన్ పేషెంట్లు కూడా అంతా ఖాళీ అయ్యారు. దీంతో ఆస్పత్రులకు రావాలనుకుంటున్న వారు కూడా వెనుకంజ వేస్తుండగా, ఎమర్జెన్సీ కేసుల వారు ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్తున్నారు. ఇక కొన్ని చోట్ల మాత్రం అత్యవసర సమయాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు లేకపోవడం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు.

డాక్టర్లపై పని ఒత్తిడి..

ఖమ్మం జిల్లాలో దాదాపు 450కి పైగా చిన్న, పెద్ద ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. కరోనా ప్రభావం పెరుగుతున్న సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటన్నింటిని మూసివేశారు. ఔట్ పేషెంట్లను చూడొద్దని ఆదేశాలు రాగా, చాలా ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్లను కూడా చికిత్స చేసి పంపించేశారు. అయితే హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ చూడొచ్చని, ప్రైవేట్ ఆస్పత్రులతో మాట్లాడి వాటిలో ఔట్ పేషెంట్ సేవలు నడిచేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. దీంతో ఆస్పత్రుల యాజమాన్యాలకు డీఎంహెచ్వో వైద్య సేవలు అందించాలని సూచించారు. మరోవైపు ఆర్ఎంపీల ఆధ్వర్యంలో నడిచే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లు సుమారు 1,550 ఉన్నాయి. వాటిని కూడా అధికారులు మూసివేయించారు. దీంతో పేషెంట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు. లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రసూతి కేసుల సంఖ్య పెరిగింది. ఇక ఐసొలేషన్, క్వారంటైన్ సెంటర్ల కారణంగా ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లపై ఒత్తిడి పెరిగింది. కరోనా స్పెషల్ వార్డుల్లో పేషెంట్ల సంఖ్య పెరగడంతో ఇటు ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ వైద్య సేవలకు, అటు కరోనా వార్డుల్లో సేవలకు చికిత్స చేయాల్సి రావడంతో పని ఒత్తిడి ఉంటోందని కొందరు డాక్టర్లు చెబుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన సున్నం నాగమణి దాదాపు వారం రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. మూడు రోజులకే పసికందుకు తీవ్రమైన జ్వరం రావడంతో చిల్డ్రన్ స్పెషలిస్ట్ కోసం సత్తుపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఇతర హాస్పిటల్స్లో చేర్చుకోకపోవడం, ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల డాక్టర్ లేకపోవడంతో ఓ చెస్ట్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో అక్కడి డాక్టర్లు చికిత్స అందించారు. పాప కోలుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. కరోనా ఎఫెక్ట్తో కొన్ని ఆస్పత్రులు మూసివేయడంతో కొందరు ఎమర్జెన్సీ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. సత్తుపల్లికి 40, 50 కిలోమీటర్ల నుంచి రోగులు వస్తున్నారు.

పాపకు జ్వరం వస్తే ఇబ్బంది పడ్డాం

మా పాపకు తీవ్రంగా జ్వరం రావడంతో చిన్న పిల్లల డాక్టర్ కోసం వెతికాం. ఆటోలు కూడా లేకపోవడంతో నడుచుకుంటూనే మూడు నాలుగు ఆస్పత్రులు తిరిగాం. కానీ ఎక్కడా పాపకు చికిత్స చేయలేదు. చివరకు ఒక డాక్టర్ పాపకు మందులు ఇచ్చి జ్వరం నయం చేశారు.

– సున్నం సూరిబాబు, తోగ్గూడెం

మానవతా దృక్పథం చూపించాలి

కొంత మంది ప్రైవేట్ డాక్టర్లు అత్యవసర సమయాల్లో వైద్య సేవలకు వెనుకంజ వేస్తున్నారు. భయపడి పేషెంట్లను చేర్చుకోవ డం లేదు. ప్రాణాపాయ స్థితిలో డాక్టర్లను ఆశ్రయించే రోగులపై మానవతా దృక్పథంలో ఆస్పత్రుల్లో చేర్చుకోవాలి.

– డాక్టర్ మట్టా దయానంద్, సత్తుపల్లి