తుర్కియేలో విమానం కూలి.. లిబియా ఆర్మీ చీఫ్ మృతి

తుర్కియేలో విమానం కూలి.. లిబియా ఆర్మీ చీఫ్ మృతి
  • నలుగురు అధికారులు, ముగ్గురు సిబ్బంది దుర్మరణం

అంకారా: తుర్కియేలో ప్రైవేట్ జెట్ కూలిపోవడంతో లిబియా ఆర్మీ చీఫ్ సహా మరో ఏడుగురు చనిపోయారు. మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. తుర్కియే రాజధాని అంకారా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. సాంకేతిక లోపంతోనే విమానం కూలిపోయిందని లిబియా అధికారులు తెలిపారు.

 రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నతస్థాయి రక్షణ చర్చలు జరపడానికి లిబియా ప్రతినిధులు అంకారాకు వచ్చారని తుర్కియే దేశ అధికారులు చెప్పారు. లిబియా ఆర్మీ చీఫ్ మహమ్మద్ అలీ అహ్మద్ అల్ హద్దాద్ తో సహా మరో నలుగురు అధికారులు ఈ ప్రమాదంలో చనిపోయారని ఆ దేశ ప్రధాని అబ్దుల్ హమీద్ ద్బీబా తెలిపారు. ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.

 ప్రతినిధులు స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, ఇది లిబియాకు తీవ్ర నష్టమని చెప్పారు. మరో ముగ్గురు క్రూ సభ్యుల ఆచూకీని కనుగొనడానికి అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.