సీఎం రేవంత్‌పై కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌

సీఎం రేవంత్‌పై కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో  రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయంటూ హైదరాబాద్‌లోని స్పెషల్‌ జ్యుడీషియల్‌   ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ (జేఎఫ్‌సీఎం) కోర్టులో బీజేపీ ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు జులైకి వాయిదా వేయడంతో ఇది చట్టవిరుద్ధం అంటూ హైకోర్టును ఆశ్రయించింది. 

తమ ఫిర్యాదుపై వెంటనే విచారణ చేపట్టేలా జేఎఫ్‌సీఎం కోర్టుకు ఆదేశాలివ్వాలంటూ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది. బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న రేవంత్‌ వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా, బీజేపీ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ నెల 22న విచారణ సందర్భంగా వివరాలు సమర్పించేందుకు మధ్యాహ్నానికి విచారణను వాయిదా వేయాలని కోర్టును లాయర్‌‌ కోరగా, అందుకు జడ్జి నిరాకరిస్తూ జులై 6కు వాయిదా వేశారన్నారు. దీంతో తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు.