స్కూల్స్ ఓపెన్.. తల్లిదండ్రుల్లో టెన్షన్

స్కూల్స్ ఓపెన్.. తల్లిదండ్రుల్లో టెన్షన్

జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల్లో టెన్షన్ పడుతుంటారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఇంకో రెండు రోజుల్లో స్కూళ్లు తెరుచుకోనున్నాయి. స్కూల్ కు వెళ్లేందుకు పిల్లలు రేడీ అవుతుంటే.. పేరెంట్స్ మాత్రం ఫీజులను తలుచుకుని బుగులు పడుతున్నారు. గతేడాదితో పోల్చితే ప్రైవేటు స్కూళ్లు ఇప్పటికే 10 నుంచి 30 శాతం ఫీజులు పెంచేశాయి. ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలను నియంత్రించాల్సిన రాష్ట్ర సర్కార్ ...కమిటీలు, సమీక్షల పేరుతో కాలం గడుపుతోంది.

జూన్ 13న బడులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని 10వేల 763 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 32 లక్షల మందికి పైగా విద్యార్ధులు చదువుతున్నారు. వీటిలో స్కూల్ స్ధాయిని బట్టి ఏటా 20 వేల నుంచి 5 లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫ్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రించాలనే డిమాండ్ చాలా ఏండ్ల నుంచి ఉంది. విద్యార్ధి సంఘాలు, పేరెంట్స్ నిరసనలు, ఆందోళనలు చేస్తూనే ఉంటారు. కానీ సర్కారులో చలనం రావట్లేదు. మరో వైపు ప్రతి ఏడాది పెంచుతున్న ఫీజులకు తోడు టెస్ట్ బుక్స్ , యూనిఫామ్స్ , నోట్ బుక్స్ , షూస్ ఇలా అన్ని బడుల్లోనే కొనాల్సి వస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు పేరెంట్స్. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

తమ విషయంలో స్కూల్ యాజమాన్యాలు కఠినంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఎంత చెబితే అంత కట్టాల్సిందేనని.. లేకపోతే పిల్లల్ని బడులకు పంపొద్దంటున్నారని వాపోతున్నారు. వచ్చే జీతాలకు తాము కట్టే ఫీజులకు పొంతన లేదంటున్నారు. దీంతో స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. స్కూల్ ఫీజులు విపరీతంగా పెంచేశాయి యాజమాన్యాలు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని ప్రకటించి నెలలు గడిస్తోంది. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు డోనేషన్స్, ఫీజుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం కఠినంగా వ్యవరిస్తేనే స్కూల్ యాజమాన్యాల ఆగడాలకు అడ్డుకట్ట పడదంటున్నారు విద్యవేత్తలు.