ముసుగు తీసింది..బాడీ బిల్డరయింది

ముసుగు తీసింది..బాడీ బిల్డరయింది

రాజస్తాన్‌లోని బికనీర్‌ ప్రియ సొంతూరు. ఎనిమిదేండ్ల వయసులోనే పెండ్లి చేశారు తల్లిదండ్రులు. అక్కడ పెండ్లైన ఆడవాళ్లు చదువుకోకూడదు. ఇంటి పని మాత్రమే చేయాలి. పరాయివాళ్లకు కనిపించకుండా ముఖాన్ని చీర కొంగుతో కప్పేసుకోవాలి. దాంతో ఐదో క్లాస్​ వరకు చదివిన ప్రియను బడి మానిపించారు. చిన్నప్పటినుంచే ఇంటి పనులు చేస్తూ, మేకలు, గొర్రెలు కాస్తూ పెరిగింది ప్రియ. పదిహేనేండ్లు నిండాక జైపూర్‌లో ఉన్న అత్తారింటికి పంపించేశారు తల్లిదండ్రులు.

పూట గడిచేందుకు...
ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్నాళ్లకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అవి తీర్చడానికి ఏదైనా పని చేయాలనుకుంది. తక్కువ జీతం అయినా పూట గడిస్తే చాలని 2015లో అక్కడున్న జిమ్‌లో హెల్పర్‌‌గా చేరింది. రోజూ కష్టపడి పనిచేస్తూనే జిమ్‌లో ట్రైనర్లను చూస్తూ అన్నిరకాల ఎక్సర్‌‌సైజ్‌లు నేర్చుకుంది. కొన్నాళ్లకు అదే జిమ్‌లో ట్రైనర్‌‌గా మారింది. మంచి హైట్‌తో, ఫిట్‌గా ఉన్న ప్రియను గమనించిన జిమ్‌ ట్రైనర్స్‌ ‘నేచురల్‌గానే నువ్వు ఫిట్‌గా ఉన్నావు. కొంచెం కష్టపడితే చాలు, బాడీ బిల్డింగ్‌ ఫీల్డ్​లో నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది’ అని ఎంకరేజ్‌ చేశారు. తనక్కూడా చిన్నప్పటినుంచి స్పోర్ట్స్‌ అంటే ఇంట్రెస్ట్‌ ఉండటం వల్ల బాడీ బిల్డింగ్‌ ఫీల్డ్‌ గురించి ఆలోచించింది.  

ఇబ్బందుల్ని దాటి  
భర్తతో ‘నేను బాడీ బిల్డర్ అవుతాన’ని చెప్పింది. అతను ఒప్పుకున్నాడు. కానీ, అత్తామామలు వద్దన్నారు. ఈ విషయం పుట్టింట్లో తెలిసేసరికి వాళ్లు కూడా తిట్టారు. ‘మా పరువు తీస్తున్నావు. ఆడవాళ్లెవరైనా ఇలా చేస్తారా? అసలు వాళ్లు ఎలాంటి బట్టలు వేసుకుంటారు. ఈ పని చేస్తే ఇంటికి రావద్దు’ అన్నారు. ప్రియ అన్న అయితే ‘నువ్వు బాడీ బిల్డింగ్‌ చేస్తే చంపేస్తాన’ని బెదిరించాడు కూడా. కానీ, అవేవీ పట్టించుకోలేదు ప్రియ. భర్త ద్వారా అత్తామామలతో మాట్లాడి, వాళ్ల ఆలోచనల్ని మార్చగలిగింది. వాళ్లను ఒప్పించి ట్రైనింగ్ మొదలుపెట్టింది. బాడీ బిల్డింగ్‌ చేసే ఆడవాళ్లు మగవాళ్లకన్నా మూడు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. వాళ్లకన్నా ఎక్కువ ప్రొటీన్‌ తీసుకోవాలి. దానికోసం నెలకి 50వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఎంత కష్టం వచ్చినా ట్రైనింగ్ విడిచిపెట్టలేదు ప్రియ. ఆ కష్టమే 2018,2019,2020లో ‘మిస్‌ రాజస్తాన్‌’ గా గెలిపించింది. అవేకాకుండా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గెలిచింది. తరువాత తల్లిదండ్రులు కూడా ప్రియను ఇంటికి పిలిచారు.  ఆడవాళ్ల పట్ల మార్పు రావడానికి కారణమైనందుకు ప్రియకు 2022 మార్చిలో ‘వరల్డ్‌ విమెన్‌ లీడర్‌‌ షిప్‌ అవార్డ్‌’ కూడా వచ్చింది. ఇప్పుడు ఐఎఫ్‌బిబి (ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బాడీ బిల్డింగ్‌ అండ్‌ ఫిట్‌నెస్) పోటీలకు రెడీ అవుతోంది. 

మహిళ అంటే కేవలం ఇంటిపని, వంటపనికే పరిమితం కాదు. లైఫ్​లో ఏదైనా సాధించాలని వాళ్లకంటూ ఒక గోల్‌ ఉంటుంది. దాన్ని పెండ్లి అనే ముసుగుతో కప్పేస్తుంటారు కొందరు. కానీ, వాళ్లకు సపోర్ట్‌ ఇస్తే... వాళ్లూ ఉద్యోగం చేసి కుటుంబ గౌరవాన్ని నిలబెడతారు.