
మరో కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఆస్కార్ వేడుకలకు హాజరు కాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రియాంక చోప్రాలు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లాస్ ఏంజిల్స్‌లోని పారమౌంట్ పిక్చర్స్ స్టూడియోస్‌లో ప్రియాంక చోప్రా (మలాల యూసఫ్ జైతో కలిసి) ఇచ్చిన పార్టీకి హాజరైన రామ్ చరణ్.. తన భార్య ఉపాసనతో కలిసి ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోలు ట్రెండింగ్ లో నిలిచాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం అంతా అమెరికాలో సందడి చేస్తోంది. సినీ ఇండస్ట్రీలో అత్యున్నత అవార్డు ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీ నామినేట్ కావడంతో రెడ్ కార్పెట్ పై నడిచేందుకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు డైరెక్టర్ రాజమౌళి సహా యూనిట్ మొత్తం యూఎస్ కు చేరుకుంది.
మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఈ ఆస్కార్ వేడుకకు అంతా సిద్ధమైంది. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు సినీ తారాలోకం కదలి అమెరికాకు పయనమైంది. ఈ క్రమంలో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ దిగ్గజాలతో ఆర్ఆర్ఆర్ టీం ఇంటరాక్ట్ అవుతోంది. తాజాగా నటి ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీకి రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన కూడా రావడం అందర్నీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, ఉపాసన, ప్రియాంక చోప్రా కలిసి ఫొటోలు దిగడంతో.. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమంలో దక్షిణాసియాకు చెందిన నటులు, నిపుణులు, ఆస్కార్ నామినీస్, ఇతర సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంకకు ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధన్యవాదాలను తెలియజేశారు. ‘‘మాకు అండగా నిలిచేందుకు వచ్చిన ప్రియాంకకు కృతజ్ఞతలు" అని తెలిపారు. తన భర్త రామ్ చరణ్, ప్రియాంక చోప్రాతో కలిసి ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేసుకున్నారు.
వీరితో పాటు నటి ప్రీతి జింతా కూడా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సెల్ఫీ దిగిన ఫొటోను షేర్ చేశారు. పార్టీ ఇచ్చి ఇలా ప్రముఖులను కలిసేలా చేసిన ప్రియాంక చోప్రాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. దాంతో పాటు నోబెల్ శాంతిబహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ తో ఉన్న ఫొటోను కూడా ప్రీతి పోస్ట్ చేశారు. ఈ ఈవెంట్ లో అంజుల ఆచార్య, మిండి కలింగ్, కుమైల్ నంజైని, కల్ పెన్, అజీజ్ అన్సారీ, బెలా బజ్రియా, రాధికా జోన్స్, జోసెఫ్ పటేల్, శ్రుతీ గంగూలీ, అనితా ఛటర్జీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు