ప్రియాంక రాకతో కాంగ్రెస్ లో నయా జోష్

ప్రియాంక రాకతో కాంగ్రెస్ లో నయా జోష్
  • స్థానిక సమస్యల ప్రస్తావన
  • ఎమ్మెల్యే పనితీరుపై విమర్శలు
  • పీవీని గుర్తు చేసిన ప్రియాంక

హుస్నాబాద్, వెలుగు:  హుస్నాబాద్‌ పట్టణంలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్​ సభకు ఏఐసీసీ సెక్రెటరీ ప్రియాంక గాంధీ హాజరవడంతో పార్టీ కేడర్​లో కొత్త జోష్ కనిపించింది.​ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవడమే కాకుండా ప్రియాంక ప్రసంగం కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.  వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో దాదాపు మూడున్నర గంటలు ఆలస్యంగా సభ జరిగింది.

ప్రియాంక గాంధీ సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్​లో హుస్నాబాద్ కు చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేసి దాదాపు అరగంటపాటు ప్రసంగించింది. పొన్నం ప్రభాకర్ ఆమె ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. హుస్నాబాద్ సమస్యలతో పాటు ఈ ప్రాంతానికి చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, సర్వాయి పాపన్న లను గుర్తు చేశారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలకు వెంటనే ఆమోద ముద్ర వేస్తామని ప్రకటించారు.

స్థానిక సమస్యల ప్రస్తావన

గౌరవెల్లి , గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయా.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు నీళ్లు అందుతున్నాయా... ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు  పరిహారాలు అందాయా.. అంటూ ప్రియాంక గాంధీ స్థానిక సమస్యల గురించి మాట్లాడారు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల పొలాలకు నీళ్లు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  భూ పరిహారాలు  అందక పోతే స్థానిక ఎమ్మెల్యే  గొంతు  విప్పాడా.. పేదల పక్షాన ఎప్పుడైనా పోరాటం చేశాడా అని ప్రశ్నించారు. పదేండ్లుగా హుస్నాబాద్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేరుతాయని చెప్పారు. 

సీఎం, పీఎం లపై విమర్శలు

ప్రియాంక గాంధీ తన ప్రసంగంలో సీఎం కేసీఆర్, పీఎం మోదీలపై ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ లో రైతు రుణమాఫీ జరగడంలేదని, డబ్బులు లేవని సర్కారు దీన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. అదాని లాంటీ బడా పెట్టుబడిదారుకు ప్రధాని మోదీ కొమ్ము కాస్తూ దేశ సంపదను అప్పగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లు మూడు పార్టీలు ఒక్కటేనని ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్, రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీ అండదండలు అందిస్తున్నాయన్నారు.

వాతావరణం అనుకూలించక పోవడంతో అనుకున్న సమయానికి ప్రియాంక గాంధీ హుస్నాబాద్ కు చేరుకోక పోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ టెన్షన్ పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జరగాల్సిన మీటింగ్ ఆలస్యం కావడంతో సభ జరుగుతుందా లేదా అనే అనుమానం వచ్చింది. చివరకు 4.30 గంటలకు ప్రియాంక సభా ప్రాంగణానికి చేరుకోవడంతో అందరూ సంతోషించారు. 

అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా

తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హుస్నాబాద్ అభివృద్ధి చెందలేదని, విద్య, వైద్యం వంటి మౌలిక రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు.  పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న సర్వాయి పాపన్న కోట, పొట్లపల్లి రాజన్న, హుస్నాబాద్ ఎల్లమ్మ, కొత్తకొండ వీరన్న ఆలయాలు ఆశించిన మేర డెవలప్​ కాలేదన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. స్థానిక  ఎమ్మెల్యే నిర్వాకం వల్ల  హుస్నాబాద్ మూడు ముక్కలైందని, ప్రజాభీష్టానికి విరుద్ధంగా సిద్దిపేట జిల్లాలో కలిపి అన్యాయం చేశారన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి తో పాటు హుస్నాబాద్ కు పూర్వ వైభవం తీసుకొస్తానని హామిఇచ్చారు.