- 35 రన్స్ తేడాతో స్కాట్లాండ్‌కుచెక్
- హ్యాట్రిక్ సహా 5 వికెట్లుపడగొట్టిన షెఫర్డ్
కోల్‌కతా: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న వెస్టిండీస్.. టీ20 వరల్డ్ కప్‌లో బోణీ చేసింది. బ్యాటింగ్‌లో షిమ్రన్ హెట్‌మయర్ (36 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) ధనాధన్‌కు తోడు బౌలింగ్‌లో పేసర్ రొమారియో షెఫర్డ్ (5/20) చెలరేగడంతో.. శనివారం జరిగిన గ్రూప్–సి మ్యాచ్‌లో విండీస్ 35 రన్స్ తేడాతో స్కాట్లాండ్‌కు చెక్ పెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 182/5 స్కోరు చేసింది. బ్రెండన్ కింగ్ (35) రాణించాడు. విండీస్ తరఫున టీ20ల్లో ఫాస్టెస్ హాఫ్ సెంచరీ (22 బాల్స్) చేసిన తొలి బ్యాటర్‌గా హెట్‌మయర్ రికార్డులకెక్కాడు. తర్వాత స్కాట్లాండ్ 18.5 ఓవర్లలో 147 రన్స్‌కే ఆలౌటైంది. రిచీ బెరింగ్టన్ (42) టాప్ స్కోరర్.
ఛేజింగ్‌లో స్కాట్లాండ్‌ను కట్టడి చేయడంలో కరీబియన్ బౌలర్లు పూర్తిగా సక్సెస్ అయ్యారు. షెఫర్డ్‌కు తోడుగా జాసన్ హోల్డర్ (3/30) బంతితో నిప్పులు చెరిగాడు. ఈ ఇద్దరి ధాటికి స్కాట్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 37 రన్స్‌కే జార్జ్ మున్సే (19), మైకేల్ జోన్స్ (1), బ్రాండన్ మెకల్లమ్ (14) ఔట్ కావడంతో స్కాట్లాండ్ 37/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో బెరింగ్టన్, టామ్ బ్రూస్ (35) నాలుగో వికెట్‌కు 78 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
కానీ 14వ ఓవర్‌లో బెరింగ్టన్‌ను ఔట్ చేసిన హోల్డర్ వికెట్ల పతనానికి మళ్లీ తెరలేపాడు. ఐదు బాల్స్ తర్వాత బ్రూస్‌ను మోతీ (1/29) దెబ్బకొట్టాడు. మార్క్ వాట్ (15) నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేసినా.. రెండో ఎండ్‌లో షెఫర్డ్ హ్యాట్రిక్‌తో కలిపి నాలుగు వికెట్లు పడగొట్టాడు. 17వ ఓవర్ రెండు, మూడు, నాలుగో బాల్స్‌కు వరుసగా మాథ్యూ క్రాస్ (11), మైకేల్ లీస్క్ (0), ఒలివర్ డేవిడ్సన్ (0)ను, ఆఖరి బాల్‌కు సఫయాన్ షరీఫ్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. చివరకు వాట్, బ్రాడ్ కరీ (2 నాటౌట్) టార్గెట్‌ను అందుకోలేకపోయారు. హెట్‌మయర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
22 బాల్స్‌లోనే..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు బ్రెండన్ కింగ్, షాయ్ హోప్ (19) నిలకడగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. సింగిల్స్, డబుల్స్‌తో పాటు నాలుగు బౌండ్రీలే కొట్టడంతో పవర్‌ప్లేలో 33 రన్సే వచ్చాయి. చివరకు 9వ ఓవర్‌లో హోప్ ఔట్‌తో తొలి వికెట్‌కు 54 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. మరో ఆరు బాల్స్ తర్వాత కింగ్ కూడా వెనుదిరగడంతో స్కోరు 58/2గా మారింది. ఫస్ట్ టెన్‌లో విండీస్ 66/2కే పరిమితమైంది. ఈ దశలో హెట్‌మయర్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. లాంగాన్, లాంగాఫ్, మిడాఫ్‌లో ఆరు భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 22 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో ఎండ్‌లో రొవ్‌మన్ పావెల్ (24) కూడా వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది.
ఈ ఇద్దరు మూడో వికెట్‌కు కేవలం 37 బాల్స్‌లోనే 81 రన్స్ జోడించడంతో విండీస్ తేరుకుంది. తర్వాత వచ్చిన రూథర్‌ఫోర్డ్ (26) కూడా బ్యాట్ ఝుళిపించాడు. హెట్‌మయర్‌తో పోటీపడి బౌండ్రీలు రాబట్టాడు. నాలుగో వికెట్‌కు 21 బాల్స్‌లోనే 36 రన్స్ జోడించారు. వరుస బాల్స్‌లో ఈ ఇద్దరు ఔటైనా రొమారియో షెఫర్డ్ (6 నాటౌట్) సిక్సర్‌తో విండీస్ మంచి స్కోరు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్: 20 ఓవర్లలో 182/5 (హెట్‌మయర్ 64, కింగ్ 35, బ్రాడ్ కరీ 2/23). స్కాట్లాండ్: 18.5 ఓవర్లలో 147 ఆలౌట్ (బెరింగ్టన్ 42, బ్రూస్ 35, షెఫర్డ్ 5/20, హోల్డర్ 3/30).
