ప్రధాని మోడీకి రాజకీయం, ప్రచారాలే ముఖ్యం

ప్రధాని మోడీకి రాజకీయం, ప్రచారాలే ముఖ్యం

కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ..ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ప్రజలను పట్టించుకోకుండా.. అధికారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.అంతేకాదు వాస్తవాలకు బదులుగా ప్రచారానికే విలువనిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభాన్ని అడ్డుకోవడంలో మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు. ఆయన కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని విమర్శించారు. ఈ సంక్షోభానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రధానిని ప్రశ్నించే సమయం వచ్చిందని, ప్రధాని అసమర్థ పాలన గురించి ప్రపంచమంతా తెలిసిందన్నారు ప్రియాంక.

కరోనాకు సంబంధించిన వాస్తవాలను తెలియకుండా దాచారని.. బాధ్యతల నుండి పారిపోయేందుకు మోడీ యత్నించారన్నారు. దీంతో కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత విజృంభించినా.. మోడీ ప్రభుత్వం చలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరణాల సంఖ్య అధికమైందన్నారు. సెకండ్‌ వేవ్‌ ఉధృతిపై ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లోని నిపుణులు చేసిన హెచ్చరికలను ప్రధాని మోడీ పట్టించుకుని ఉంటే.. ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదన్నారు.

 మోడీ తన ర్యాంకింగ్‌లకు, ఇమేజ్‌ను పెంచుకునేందుకు కాకుండా ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే దేశంలో వ్యాక్సిన్‌ల కొరత వచ్చివుండేది కాదన్నారు ప్రియాంక గాంధీ. మీడియాను కూడా తన ఇమేజ్‌, ప్రచారం కోసం ఉపయోగించుకున్నారని విమర్శించారు.