- మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్
న్యూఢిల్లీ: ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం డ్రామా కాదని.. వాటిపై చర్చకు అనుమతించకపోవడమే డ్రామా అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు.. ప్రతిపక్షాలు పార్లమెంటులో డ్రామాలు ఆడుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంట్ ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(సర్), ఢిల్లీలో వాయు కాలుష్యం వంటి అత్యవసర అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తున్నాం. ఇవి పార్లమెంటులో చర్చించాల్సిన ముఖ్యమైన ప్రజా సమస్యలు.
ఈ విషయాలపై చర్చించడానికి ఎందుకు అనుమతివ్వడం లేదు’’ అని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి అందరూ కలిసి ఈ సమస్యపై బలమైన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. "ఈ పరిస్థితి నిజంగా సిగ్గుచేటు అని నేను భావిస్తున్నాను. ఇది మన దేశ రాజధాని నగరం. మనం పార్టీలను పక్కన పెట్టి, మన శక్తులన్నింటినీ కలిపి పరిపాలన, రాజకీయ, పౌర సమాజం, న్యాయవ్యవస్థ కొన్ని బలమైన చర్యలు తీసుకోవాలి" అని ఆమె అన్నారు.
