అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలె

అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలె

మహబూబాబాద్, వెలుగు : అనేక పోరాటాలు, ఎంతోమంది ప్రజల త్యాగాల మూలంగానే తెలంగాణ ఏర్పడిందని, కానీ..పాలకుల మార్పు మాత్రమే జరిగిందని..పాలన స్వభావంలో సంపూర్ణ మార్పు రావాల్సిన అవసరం ఉందని  తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో కోర్టు సెంటర్ వద్ద తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్​ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు అద్దంకి దయాకర్, ఇతర నేతలతో కలిసి  ఆవిష్కరించారు. తర్వాత  జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కోదండరాం మాట్లాడారు. 

స్వరాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతాయని ప్రజలు ఆశించారన్నారు. టీఎస్​పీఎస్సీ నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల నిరుద్యోగులు తమకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కవనే ఆవేదనతో ఇతర రంగాలకు మళ్లుతున్నారన్నారు. రాష్ట్రంలో పరీక్షలు రాసినా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అందరం కలిసికట్టుగా నిలబడి వచ్చిన తెలంగాణను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదని, ఉద్యమాల్లో పాల్గొని త్యాగాలు చేసిన వారికి  గుర్తింపు లేకుండా పోతోందన్నారు. ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్  ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, జేఏసీ జిల్లా చైర్మన్  డోలి సత్యనారాయణ, కో కన్వీనర్​ పిల్లి సుధాకర్, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు మండల వెంకన్న, విజయసారథి, అజయ్ సారథి, గుగ్గిళ్ల పీరయ్య, హనుమంతు, బీఆర్ఎస్ జడ్పీ ఫ్లోర్ ​లీడర్​ ఎం. శ్రీనివాస్ ​హాజరయ్యారు.