నాస్ ఫార్మాలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం : ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్

నాస్ ఫార్మాలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం : ప్రభుత్వ విప్ వేముల  వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్

చిట్యాల, వెలుగు : నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలోని నాస్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వారు ప్రమాద స్థలాన్ని సందర్శించి, రియాక్టర్ పేలుడుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన ఉద్యోగులు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ కుమార్‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌లోని అపోలో ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

బాధితులకు కంపెనీ తరఫున అన్ని విధాలా అండగా ఉండాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. పరిశ్రమల అనుమతులు, కార్మికుల భద్రత, కాలుష్య నియంత్రణపై తక్షణమే నివేదిక ఇవ్వాలని చీఫ్ ఇన్​స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక, రెవెన్యూ శాఖలను ఆదేశించారు. వేముల వీరేశం మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని 
హెచ్చరించారు.